ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తే.. ఓ విషయం అర్థమవుతుంది. అదేంటంటే.. మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద అంశాలు వాళ్లను చుట్టుముడుతున్నాయి. ఇప్పటి వరకూ ముగ్గురు మంత్రులు ఇలా ఫోకస్ అయ్యారు. అయితే.. వాళ్లే వివాదాల్లోకి వెళ్తున్నారా? వివాదాలే వాళ్లను వెతుక్కుంటూ వస్తున్నారా? అని చాలా మంది సందేహించారు. అయితే.. అందుతున్న సమాచారం మాత్రం వేరుగా ఉంది.
Also Read: అడకత్తెరలో పోకచెక్కలా ఏపీ బీజేపీ..!
మొదటగా మంత్రి గుమ్మనూరు జయరాం వార్తల్లోకి వచ్చారు. ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ కంటిన్యూస్ గా వార్తలు వచ్చాయి. భూకబ్జాలు మొదలుకొని పేకాట క్లబ్బుల వరకూ చాలా విషయాల్లో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. సీక్వెల్ గా కొన్ని రోజులపాటు సాగిన ఈ ఎపిసోడ్ ఆ తర్వాత సైలెంట్ అయ్యింది.
ఆయన తర్వాత కొడాలి నాని ఇంకా వివాదాస్పదం అయ్యారు. విపక్షంపై ఓ రేంజ్ లో చెలరేగిపోయారు నాని. అయితే.. ఈ క్రమంలోనే ఆయన పేకాట క్లబ్బుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ విమర్శలకు సమాధానం చెప్పే విషయంలోనూ గీత దాటినట్టుగానే మాట్లాడారు నాని. పేకాట క్లబ్‌లు నడిపితే ఏమవుతుంది? ఉరిశిక్షలు వేస్తారా? ఫైన్లు వేస్తారు అంటూ ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో ఆయన కూడా వివాదాస్పదం అయ్యారు.
ఇప్పుడు తాజాగా.. మంత్రి వెల్లంపల్లి లైన్లోకి వచ్చారు. దుర్గగుడిలో అవినీతికి ఆయనే ఆద్యుడు అన్నట్టుగా విమర్శలు వచ్చాయి. ఏసీబీ సోదాలు కూడా జరిగాయి. దీంతో ఆయనకూ అక్రమాల మరకలు పూసినట్టైంది. ఏసీబీ నివేదిక కూడా ఆ తరహాలోనే ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
ఇలా వరుసగా మంత్రులను వివాదాలు చుట్టు ముట్టడం వెనక సొంత రాజకీయమే ఉందంటున్నారు పరిశీలకులు. అది కూడా.. రాజకీయాలు, మీడియా విషయంలో యాక్టివ్ గా ఉండే మంత్రులపైనే ఆరోపణలు, విమర్శలు రావడం గమనార్హం. సైలెంట్ గా ఉండి తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తున్నవారిపై మాత్రం ఎలాంటి ఆరోపణలూ రావట్లేదు.
Also Read: సోమూ వీర్రాజుపై.. ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వక దాడి..!
దీనికి కారణం ఏమంటే.. ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్నవారు రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవుల్లో ఉంటారని సీఎం జగన్ ముందుగానే చెప్పారట. ఆ సమయం దగ్గర పడుతోంది. కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి, కొందరిని తప్పించి, మిగిలిన వాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. యాక్టివ్ గా ఉన్నవారు వ్యతిరేక స్వరం వినిపించే అవకాశం ఉండొచ్చని భావిస్తోందట అధిష్టానం.
సైలెంట్ గా ఉన్న మంత్రులు పదవి నుంచి తప్పించినా అలాగే ఉంటారని వైసీపీ హైకమాండ్ భావిస్తోందంట. యాక్టివ్ గా ఉన్నవారు ఒకవేళ ఎదురు తిరిగినా.. వారిపై ఎలాగో అవినీతి ముద్ర, ఇతరత్రా ఆరోపణలు ఉంటాయి కాబట్టి, వారి అసమ్మతికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని భావిస్తోందట! అందుకే.. యాక్టివ్ గా ఉన్నవారిని ఇలా బుక్ చేస్తున్నారని వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. అలాంటి వారిని లిస్ట్ ఔట్ చేసి మరీ.. వివాదాల్లోకి నెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా భవిష్యత్ లో మంత్రి పదవులు ఉండవు అని ఇండైరెక్టుగా చెప్పేస్తున్నారనే చర్చ సాగుతోంది. మరి, ఈ రాజకీయంలో నిజమెంత? ఈ ప్రచారంలో వాస్తవం ఉందా? అనేది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్