
2019 సంవత్సరంలో ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు కాస్త నిరాశగానే ఉంటున్నారట. అదేంటీ అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే నిరాశ ఏంటీ..? అనే అనుమానం రావచ్చు. అయితే ఇది నిజంగానే నిజం. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే కరోనా మహమ్మారి విజృంభించి ప్రజాప్రతినిధులకు నిదుర లేకుండా చేస్తోంది. కొందరు మంత్రులైతే తాము పేరుకే మంత్రులే గానీ ఆ హంగు ఆర్భాటం అనుభవించేదెప్పుడు అని అనుకుంటున్నారు. ఇది చాలదంటూ మంత్రి వర్గ విస్తరణ ముంచుకొస్తుంది.
2019 జూన్ 8న 25 మంది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సంబరాలు అటూ ఇటు నెల గడిచినా.. ఆ తరువాత నెలలు గడిచేసరికి అంటే 2020 మార్చిలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో మంత్రులకు పని లేకుండా పోయింది. అయితే ఒక సంవత్సరం పోతేపోయింది.. నెక్ట్్ ఇయర్లోనైనా బాగుంటుంది అనుకున్న వారికీ ఈ సంవత్సరం మొదటి నుంచే తలుపులు మూసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇక తాము ప్రజల్లోకి వెళ్లేదెన్నడు..? అని ఆవేదన చెందుతున్నారట. పేరుకే తాము మినిస్టర్లమని చెప్పుకునుడు తప్ప మంత్రిగా పనిచేసిందీ లేనే లేదని అనుకుంటున్నారట.
ఇదిలా ఉండగా త్వరలో మంత్రి వర్గ విస్తరణ రాబోతుంది. ఈ నేపథ్యంలో కొందరు మంత్రుల్లో ఇప్పటి నుంచే భయం పుట్టుకుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జీతం తీసుకోవడం తప్ప అధికారికంగా ఏ పని చేసిన తృప్తి లేదని కొందరు ఆవేదన చెందుతున్నారట. అంతేకాకుండా నష్టపోయిన వారికి సాయం చేసినట్లుగా తమ మంత్రుల పదవీ కాలాన్ని కూడా మరికొంతకాలం కొనసాగించాలని కొందరు ఇప్పటి నుంచే రిక్వెస్టులు పెట్టుకుంటున్నారట. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.