రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా యాభై రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కెందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ కు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో పీటీడీ (ప్రజా రవాణా విభాగం) అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెల 17వ తేదీతో మూడవ విడత లాక్ డౌన్ ముగియనుంది. అనంతరం మరోమారు కేంద్రం లాక్‌డౌన్‌ను కొనసాగించినా, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్ల వరకూ సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను పీటీడీ సర్దుబాటు చేస్తోంది. గతంలో నాలుగు వరుసలు సిట్టింగ్ విధానం స్థానంలో మూడు వరుసలు సిట్టింగ్ విధానాన్ని తీసుకువచ్చారు.
దీంతో సిట్టింగ్ కెపాసిటీ 25 శాతం తగ్గనుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి 40-50 శాతం టికెట్ల ధర పెంచేందుకు పీటీడీ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ప్రయాణికులపై భారం తప్పదు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాత్రం ప్రస్తుతం చార్జీల పెంపు ఉండదని స్పష్టం చేస్తున్నారు.