
లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరుపుతున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలంటూ మొత్తం మూడు పిటీషన్ లు దాఖలు అయ్యాయి. మద్యం అమ్మకాల సమయంలో భౌతికదూరం పాటించడం లేదంటూ పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా వాటిని పాటించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నిబంధనలు పాటించకపోతే కరోనా మరింత వ్యాపి చెందుతుందని తెలిపారు.
మరోవైపు ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చామని ప్రభుత్వం తరుపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లలో వైన్ షాపులు తెరవడం లేదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంపై హైకోర్టులో పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు ఉద్యోగి లక్ష్మీనరసింహమూర్తి పిటిషన్ వేశారు. మార్చి, ఏప్రిల్ వేతనాల్లో కోత విధించడం చట్టవ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. రెండు నెలలు పూర్తి వేతనం ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.