ఏపీలో 11 గంటల వరకే బయటకు అనుమతి

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అర్బన్ ప్రాంతాల్లో నిత్యావసరాలకు అనుమతించే సమయాన్ని కుదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యధావిధిగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఇవ్వాలన్నారు. కోవిడ్‌ –19 వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో జగన్ అధికారులను […]

Written By: Neelambaram, Updated On : March 29, 2020 6:50 pm
Follow us on

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అర్బన్ ప్రాంతాల్లో నిత్యావసరాలకు అనుమతించే సమయాన్ని కుదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యధావిధిగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఇవ్వాలన్నారు. కోవిడ్‌ –19 వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి నివారణకు మరింత పటిష్టంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు నిరంతరం ప్రతి కుటుంబం వివరాలను నమోదు చేసేలా, వారు పటిష్టంగా కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలన్నారు. నగరాలు, పట్టణాల్లో హాట్‌ స్పాట్లను గుర్తించి ఆమేరకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు.

నిత్యావసర వస్తువుల ధరలను ఎక్కువుగా అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ధరల పట్టికలో అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ను అందరికీ కనిపించేలా ఉంచాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీవీల్లో, పత్రికల్లో జిల్లాల వారీగా ధరలను ప్రకటించాలని చెప్పారు. విస్తృతంగా ఈ దరలపై ప్రచారం చేయాలని, ఎక్కువ ధరలకు అమ్మేవారిని జైళ్లకు పంపాలని ఆదేశించారు. ప్రతి సూపర్‌ మార్కెట్‌ వద్దా, దుకాణం వద్దా కచ్చితంగా ధరల పట్టికను ఉంచాలన్నారు. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది, ఈ పరిస్థితిని అధిక ఆర్జన కోసం వినియోగించుకోవడం దారుణం అన్నారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేషన్‌ దుకాణాల వద్ద ఒకే లైను కాకుండా సామాజిక దూరం పాటించేలా మూడుకు మించి లైన్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే మొబైల్‌ వ్యాన్ల ద్వారా కూరగాయలు, నిత్యావసరాల అమ్మకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యావసరాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావన రావడంతో అధికారులు కూర్చుని దీనిపై ఆలోచనలు చేయాలన్న సీఎం ఆదేశించారు.ఓల్డేజ్‌ హోంలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను అందించాలన్నారు.

సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ, ఆక్వా రంగ కార్యకలాపాలు:

ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన ఆదేశాలపై చర్యలను సీఎంకు ఉన్నతాధికారులు వివరించారు. నిర్ణయించిన ధరకన్నా తక్కువకు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే వీరిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీచేసినట్లు చెప్పారు.ఈ ధరలపై ప్రచారం చేస్తున్నామని, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

సామాజిక దూరం పాటిస్తూ ఆక్వా పరిశ్రమలు నడిపేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. కూలీల ఆరోగ్య రక్షణకోసం మాస్కులు, గ్లావ్స్‌ ఇచ్చేందుకు ఆక్వా ఫ్యాక్టరీ యజమానులు అంగీకరించారన్న అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాల వారీగా నోడల్‌ అధికారులను నియమించి, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై దృష్టిసారిస్తామన్నారు.

అలాగే వ్యవసాయానికి అవసరమైన ఎరువులు రవాణా నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల సరఫరా కూడా నిలిచిపోకుండా చూస్తున్నమన్నారు.రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను ఎక్కడికక్కడ నిల్వచేస్తున్నట్లు చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని, దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని అధికారుల తెలిపారు.

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో కార్యకలాపాలు కొనసాగేలా, అదే సమయంలో వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు, జాగ్రత్తలు తీసుకుని వాటి కార్యకలాపాలు ఉదయం 6 గంటలనుంచి 1 గంటవరకూ కొనసాగేలా చూడాలనన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తగ్గకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కనీస గిట్టుబాటు ధరలు వారికి లభించాలని స్పష్టం చేశారు. అగ్రీ ప్రోసెసింగ్‌ యూనిట్లలో కూడా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని, వాటి కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఏ ఏ నిత్యావసర వస్తువులు తక్కువుగా మార్కెట్లో లభ్యం అవుతున్నాయో గుర్తించి, వాటిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఉందన్న డీజీపీ సవాంగ్ తెలిపారు. ఎక్కడ సమస్యలున్నా వెంటనే పరిష్కారానికి కాల్‌సెంట్‌ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం అర్బన్‌ ప్రాంతాలపై దృష్టిపెట్టామని చెప్పారు. అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంత్రులు ఆళ్లనాని, బొత్స, మేకతోటి సుచరిత, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకట రమణ హాజరు, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.