ఇటీవలికాలం లో న్యాయ వ్యవస్థ అతి చొరవగా కార్యనిర్వాహక , శాసన అధికారాల్లో కూడా చొరబడుతుందని ఎంతోమంది రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ రోజువారీ పనుల్లో, విధానాల్లో కూడా న్యాయస్థానాలు అతిగా స్పందించటం, ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగం నిర్వచించిన అధికార సమతుల్యం దెబ్బ తింటుందనే విమర్శ ఇప్పటికే వున్న నేపధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఇంకో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అసలు వార్తలను ప్రసారం చేయకూడదని చెప్పటం ఎంతవరకూ సబబు? పిటీషనర్ చెప్పిన వాదనే కరెక్టయితే ఇది ప్రతి కేసుకీ వర్తిస్తుంది. సామాన్యుడి కి ఒక న్యాయం , పెద్ద వాళ్లకు మరో న్యాయం వుండకూడదు. చట్టం కింద అందరూ సమానులే. వ్యక్తి ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా కట్టడి చేయమని ఆదేశించటం కనుక సర్వ సాధారణమయితే రేపు ఏ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయబడ్డ వ్యక్తి కోర్టు ని ఆశ్రయించటం ఆయనకు ఉపశమనం కలిగించటం వరకూ ఎవరమూ ప్రశ్నించలేము. కానీ అసలు దర్యాప్తు చేయకూడదని ఆదేశించటం ఎక్కడా వినలేదు, కనలేదు, చూడలేదు. ఇదేకనుక ఒప్పుకునేటట్లయితే రేపు ఇది కూడా ప్రెసిడెంట్ అవుతుంది. పలుకుబడి కలవాళ్ళు కోర్టులకు వెళ్లి అసలు దర్యాప్తు జరగకూడదని ఈ తీర్పుని చూపించి అభ్యర్దిస్తారు. అంతకన్నా దారుణం అసలు సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా రహస్యంగా దాన్ని పాతి వేయటం. ఈ రెండూ వింతగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తి కి గొడ్డలిపెట్టుగా వున్నాయని స్పష్టంగా అర్దమవుతున్నాయి. భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇటువంటి గ్యాగ్ ఆర్డర్ ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదని మా గాఢ నమ్మకం. అదే గనుక జరిగితే అంతకన్నా ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇంకోటి వుండదు. ఇది అత్యవసర పరిస్థితి కి సమానమే. కార్యనిర్వాహక యంత్రాంగం, వాటి ప్రభావం తో శాసన వ్యవస్థలు ఇటువంటి పనులు చేయటం విన్నాం. అటువంటివి జరిగినప్పుడు ప్రజలకున్న ఒకే ఒక ఆధారం న్యాయ వ్యవస్థ. అదే ఈ పని చేస్తే ప్రజలు న్యాయం కోసం ఎక్కడకు వెళ్ళాలి? అందుకే మొదట్నుంచీ మేము కోరుతున్నది న్యాయ వ్యవస్థలో సంస్కరణలు. మిగతా రెండు వ్యవస్థల పై జవాబుదారీతనం వున్నట్లే న్యాయ వ్యవస్థపై కూడా జవాబుదారీతనం వుండాలి. దానికి తగ్గ సంస్కరణలు న్యాయవ్యవస్థలో రావాలి. అదొక్కటే ఈ సమస్యకు ఎప్పటికైనా పరిష్కారం. భారత అత్యున్నత న్యాయ స్థానం , భారత పార్లమెంటు కలిసికట్టుగా ఈ దిశగా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.