
ఎల్.జి పాలిమర్స్ విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎల్.జి దుర్ఘటనపై కొన్ని పిటీషన్లు దాఖలు అవగా, హైకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టిన విషయం విదితమే. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. పరిశ్రమ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఈ ఉత్తర్వులలో హైకోర్టు ఆదేశించింది. సంస్థ డైరెక్టర్లు సహా ఎవరు పరిశ్రమ ఆవరణలోకి వెల్లడానికి అనుమతిలేదని స్పష్టం చేసింది. విచారణ కమిటీలు మాత్రమే పరిశ్రమ ప్రాంగణంలోకి వెళ్లవచ్చని, వారి వివరాలు గేటు వద్ద ఉండే రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా పరిశ్రమ డైరెక్టర్లు ఎవరూ దేశం విడిచి వెళ్లకూడదని, వారి పాస్ ఫోర్ట్ లు విడుదల చేయవద్దని పోలీసులను ఆదేశించింది. సంస్థ స్థిర, చర ఆస్తులను తరలించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. లాక్ డౌన్ అనంతరం పరిశ్రమ పునఃప్రారంభించడానికి అనుమతులు తీసుకున్నారా అనే విషయం, తీసుకోకపోతే ప్రభుత్వం చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరింది. లాక్ డౌన్ సమయంలో ట్యాకుల నిర్వహణ ఎందుకు చేపట్టలేదు, ప్రమాదం సమయంలో అలారం ఎందుకు మోగలేదు అనే విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 26వ తేదీలోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వలని అదేశించింది. 13 వేల టన్నుల స్టైరీన్ ను దక్షిణ కొరియా తరలించడానికి బాధ్యులెవరని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సంస్థ యాజమాన్యానికి మరికొన్ని ప్రశ్నలను ఉత్తర్వులలో హైకోర్టు సంధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
.