
కరోనాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భారత వైద్య మండలి (ఐసిఎంఆర్) నిబంధనలనే అమలు పరుస్తున్నామని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తరచూ చెబుతుంటారు. అయితే తెలంగాణకు ప్రత్యేకంగా ఐసిఎంఆర్ నిబంధనలను రూపొందించిందా అంటూ ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.
తెలంగాణలో జరుపుతున్న కరోనా టెస్ట్ ల నుండి, కరోనా సంబంధిత మరణాల వరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అంశాలను చాలా గోప్యంగా ఉంచడమే అందుకు ప్రధాన కారణం. దాదాపు అన్ని రాష్ట్రాలూ ప్రతి రోజు బులెటిన్లలో టెస్టుల సంఖ్య, జిల్లాల్లో కేసులు, మరణాలను ప్రకటిస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాలైతే కరోనా బాధితులకు వైరస్ ఎట్లా సోకిందో కూడా చెబుతున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం కేసులు, మరణాలు, డిశ్చార్జి వివరాలను మాత్రమే వెల్లడిస్తున్నారు. ఏయే జిల్లా లో ఎన్ని కేసులన్న విషయాన్నీ స్పష్టం గా చెప్పట్లేదు.
మరణాల సంఖ్యను మారుస్తున్నారే తప్ప, వాళ్లు ఎప్పుడు చనిపోయిందీ చెప్పట్లేదు. కొన్ని మరణాలను అసలు బయటకు వెల్లడించట్లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఎన్నెన్నో అనుమానాలు వస్తున్నాయి.
ఎప్పటి నుంచో కేన్సర్, కిడ్నీ, గుండె జబ్బుల వంటి వాటితో బాధపడుతూ కరోనాతో చనిపోయిన వాళ్లను కరోనా లెక్కలోకి తీసుకోవద్దని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇచ్చిందంటూ ఇటీవల ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే
అలాంటి గైడ్ లైన్స్ ఏవీ ఇవ్వలేదని హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ ఐఎన్ ) స్పష్టం చేస్తున్నది..
ఆదివారం నాటి కి 53 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెబుతున్నా.. 90కి పైగా శవాలకు తామే దహన సంస్కారాలు చేశామని, అందులో కరోనా కేసులతో పాటు అనుమానిత కేసులు ఉన్నాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెబుతున్నారు.
దేశమంతటా ఇప్పటిదాకా 29 లక్షలు టెస్టులు చేయగా, తెలంగాణ లో మాత్రం 29 వేలు కూడా దాటలేదు. కరోనా లక్షణాలుం టే తప్ప టెస్టులు చేయబోమన్న ప్రభుత్వం ప్రైమరీ కాంటాక్ట్లకూ టెస్టులను బంద్ పెట్టింది. అయితే, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, ప్రతిపక్షాల విమర్శలు, టెస్టులను పెంచాలన్న కేంద్రం సూచనలతో ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్లకూ టెస్టులు చేస్తోంది. కానీ రోజూ ఎన్ని టెస్టులు చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పట్లేదు.
ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతివ్వలేదు. కానీ, కొన్ని ల్యాబుల్లో దొంగచాటుగా వేల సంఖ్యలో టెస్టులు చేశారు. ఈవిషయం తెలిసినా ప్రభుత్వం పట్టిండ్చుకోవడం లేదు. అక్కడ తేలిన కరోనా పాజిటివ్ కేసులు ప్రభుత్వ లెక్కలలో కలపడం లేదు.