AP Investments: ఏ పార్టీకైనా సోషల్ మీడియా ఇప్పుడు బలమైన ప్రచారం. అందుకే రాజకీయ పక్షాలు తమ వాయిస్ ను బలంగా వినిపించుకునేందుకు సోషల్ మీడియానే బలమైన అస్త్రంగా ఎంచుకుంటున్నాయి. లక్షలకు లక్షలు జీతాలిచ్చి సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు బలమైన సోషల్ మీడియా విభాగాలున్నాయి. అధికార వైసీపీ గత ఎన్నికల ముందు నుంచే ఈ వింగ్ ను ఏర్పాటుచేసుకుంది. అప్పటి చంద్రబాబు సర్కారుపై ప్రజా వ్యతిరేకత మూటగట్టడంలో కీలక భూమిక పోషించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత చతికిల పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వైసీపీ చేపడుతున్న ప్రచారానికి బలమైన ఆధారాలు చూపడంలో ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ విఫలమవుతోంది. అదే సమయంలో టీడీపీ వింగ్ పూర్తిస్థాయి ఆధారాలతో పోస్టులు పెడుతుండడంతో ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

లోకేష్ పాదయాత్రపై వైసీపీ చేసిన అతి అంతా ఇంతా కాదు. అటు పాదయాత్రకు అనుమతులు విషయంలో చాలారకాలుగా వైసీపీ సర్కారు ఇబ్బందిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం చేసేదానికంటే మించి ప్రచారం సాగింది. అది లోకేష్ కు మైలేజ్ తెచ్చింది. ప్రభుత్వం చెడ్డపేరును మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం విపక్షానికి ఆయుధంగా మారింది. నాడు జగన్ పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ సర్కారు అన్నివిధాలా సహకరించిందని.. నాడు లేని నిబంధనలు ఇప్పుడెందుకని టీడీపీ సహా మిగతా రాజకీయ పక్షాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. దీనికి కౌంటరిచ్చే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా పోస్టులు తేలిపోతున్నాయి. నాడు 17 పేజీల అనుమతులు తీసుకున్నామని.. పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు తీసుకున్న తలశీల రఘురాం సంతకంతో పర్మిషన్లు తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పట్లో తీసుకున్న అనుమతులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలేవీ పోస్టులకు జత చేయడం లేదు. అదే సమయంలో లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా పెట్టిన నిబంధనలు, షరతులకు సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలతో టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం నిజంగానే లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేసుకుందని ప్రజలు కూడా నమ్మే విధంగా ఈ పోస్టులు ఉండడం గమనార్హం.
అటు రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో డొల్లతనం కనిపిస్తోంది. నాడు చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద ప్రవాహం కనిపించిందని.. లక్షల కోట్లు పెట్టబడులు ఆకర్షించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని ఎల్లో మీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అవే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.

అయితే నాడు పెట్టుబడులు ఇవిగో అంటూ కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వారు పెట్టబడి పెట్టబోయే మొత్తం వంటి వివరాలను సమగ్రంగా అవిడెన్స్ రూపంలో పొందుపరచి ప్రచారం చేసేవారు. కానీ జగన్ సర్కారు విషయంలో అలా జరగడం లేదు. రాష్ట్రానికి మిలియన్ డాలటర్లు, కోట్ల రూపాయలు వస్తున్నాయని ప్రచారమే తప్ప.. వాటికి జత చేయాల్సిన ఆధారాల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో అ అంశం మైనస్ గా మారుతోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎంత ప్రచారం చేసిన ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదు. విపక్షంలో వర్కవుట్ అయినంతగా.. అధికారంలోకి వచ్చాక కుదరడం లేదు. అప్పుడు ప్రశ్నించేస్థితో ఉండగా.. ఇప్పుడు జవాబు చెప్పే స్థితిలోకి మారడమే అందుకు కారణం. ఇటువంటి సమయంలో ఆధారాలు, గణాంకాలతో తిప్పికొడితే కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.