ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.
సీఎంతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈ నెలలో సగం జీతం చెల్లిస్తామని, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు.
ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతాలు తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు సూర్యనారాయణ వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని, ఆ తర్వాత నుంచి యథావిథిగా మొత్తం ఒకే సారి ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారని తెలిపారు.
కాగా, దేశంలో కరోనా వైరస్‌కు హాట్‌బెడ్‌గా ఉన్న మహారాష్ట్రలో సహితం ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో కోత పెట్టింది. మార్చి నెలలో వీరి వేతనాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కూడా కోత పెడుతున్నట్లు ప్రకటించారు. క్లాస్ 1,2 ఉద్యోగుల వేతనాల్లో 50శాతం, క్లాస్ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర బ్యూరోక్రటిక్ ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని తెలిపారు.