
దేశంలో కరోనా కట్టడికి కేంద్రం 21రోజుల లాక్డౌన్ చేపట్టింది. దీంతో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ కరోనా కట్టడిపై సీరియస్ ఫోకస్ పెట్టాయి. అయినప్పటికి రెండు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 40పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు రికవరీ అయ్యారు.. తెలంగాణలో 77పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. 13రికవరి అయ్యారు.
ఏపీలో ఇవాళ ఒక్కరోజు కొత్తగా 17కరోనా కేసులు నమోదుకావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రయివేట్ ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వినియోగించుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అధికారులను జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు కట్టబెట్టారు. దీనిపై ఇప్పటికే ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితులను గుర్తించేందుకు ఇంటింటికి సర్వే చేపట్టాలని సూచించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో ప్రతి వార్డుకో డాక్టర్, మున్సిపాలిటీల్లో మూడు వార్డులకో డాక్టర్ నియమించాలని వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు కరోనా కట్టడికి ప్రభుత్వ వైద్యులు మాత్రమే సేవలందిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయంతో ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా కరోనా బాధితులకు చికిత్స అందించాల్సి ఉంటుంది. కరోనాపై పోరాటానికి ప్రైవేట్ వైద్యులు దూరంగా ఉండటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రైవేట్ వైద్యులు భాగస్వామ్యం అయ్యేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడిని సీరియస్ గా తీసుకోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు కూడా తమ సేవలను అందించేందుకు ముందుకొస్తున్నారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆసుప్రతులపై తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ కూడా ఆలోచిస్తుంది. తెలంగాణలోనూ అవసరమైతే ప్రయివేట్ ఆసుపత్రులను భాగస్వామ్యం చేసే అవకాశాలు కన్పిస్తున్నారు. తెలంగాణలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్నివిధలా సర్కార్ సన్నద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. లక్ష కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనంటూ తెలంగాణ సర్కార్ ప్రకటించింది. కరోనా కట్టడి చేయగలమనే ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో మాదిరిగానే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం వెనక్కి తగ్గే అవకాశం కన్పించడం లేదు. మొత్తానికి ప్రభుత్వ వైద్యులకుతోడు ప్రైవేట్ వైద్యులు కూడా కరోనా కట్టడికి ముందుకు వస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.