AP Amma Vodi Scheme 2022: ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి పథకంలో అన్ని అవాంతరాలే ఎదురు కానున్నాయి. గతంలో ఎలాంటి షరతులు లేకుండా పథకం అమలు చేసినా తరువాత కాలంలో రానురాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లుగా పథకం అమలులో షరతులు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. మొదట ఉన్న విధంగా ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పెడుతున్న షరతులపై అందరిలో ఆగ్రహం వస్తోంది.

గతంలో పథకం ప్రారంభంలో ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికి ఇచ్చినట్లే ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రారంభంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికే ఇస్తామని చెప్పడంతో విమర్శలు రావడంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారికి కూడా ఇస్తున్నారు. దీంతో అమ్మఒడి పథకాన్ని సమర్థంగా అమలు చేసే క్రమంలో లబ్ధిదారులు ఊరికే తీసుకోకుండా అందులో కొన్ని షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక నుంచి విద్యార్థుల హాజరు శాతం 75 శాతం ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో హాజరు శాతం లేనివారికి లాభం లేకుండా పోతోంది. దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా కాలంలో పాఠశాలలు నడవకపోవడంతో హాజరు శాతం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా హాజరు శాతం ఉండాలనే చెబుతున్నారు. లేకపోతే వారి పేరు జాబితాలో ఉండదని సమాచారం.
ప్రస్తుతం మరో నిబంధన కూడా విధించారు .వారి ఇంటి కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే కూడా అమ్మఒడి పథకం రాదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోంది ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్లు ఎలాంటి షరతులు లేకుండా ఇఛ్చిన సీఎం ఇప్పుడు అర్థం లేని విధంగా కొత్త తరహా దారులు వెతకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ కు భంగపాటు తప్పదనే వాదనలు కూడా వస్తున్నాయి.