జగన్ సర్కారు హనీమూన్ ముగిసి చాలా కాలమైంది. సమస్యలు, సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి కావడం కూడా ఎప్పుడో మొదలైంది. దాన్ని కవర్ చేసుకునేందుకు నానా తంటాలూ పడుతోంది. కానీ.. ఈ ఎఫెక్ట్ జనాల మీద ప్రత్యక్షంగా పడలేదు. కానీ.. గడిచిన నాలుగు నెలలుగా పరిస్థితి మారిపోయింది. ఉద్యోగులపై నేరుగా ఈ ప్రభావం పడుతోంది. ఎవరైనా ఎన్నాళ్లు భరిస్తారు? ఓపిక ఉన్నంత వరకు తట్టుకుంటారు. ఆ తర్వాత బ్రహ్మాండం బద్ధలైపోతుంది. ఇప్పుడు ఏపీలో ఇదే జరగబోతోందా? అంటే.. అవును అనే సంకేతాలే కనిపిస్తున్నాయి.
ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు అందరికీ అందే సరికి పదో తారీఖు దాటిపోయింది. అదికూడా అందరికీ ఒకేసారి కాదు. దశలవారీగా జమచేసింది సర్కారు. దీంతో.. జీతం ఎప్పుడు వస్తుంది అంటే.. పలానా తేదీ అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క నెలే కాదు. గడిచి నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి. దీంతో.. ఉద్యోగులు లోలోపల రగిలిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు. ఈ విషయమై ఎవరో ఒకరు ఓపెన్ అవుతారనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎన్జీవోలు బరస్ట్ అయిపోయారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఈ అంశంపై బలమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నాలుగు నెలలుగా జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు కూడా జిల్లాకో రోజున జమ అవుతుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సర్కారు ఉద్యోగులకు ఒకటో తేదీ అంటే పండుగ వంటిదని, అలాంటి పండుగను సర్కారు లేకుండా చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తమకు తెలియదని, జీతాలు మాత్రం సకాలంలో అందాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. మరో డిమాండ్ కూడా వినిపించారు. తెలంగాణ సర్కారు ఇచ్చినట్టుగానే.. తమకు 11వ పీఆర్సీని అమలు చేయాలని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు.
ఇదంతా చూస్తుంటే.. జగన్ కు ప్రత్యక్ష ఇబ్బందులు మొదలయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవాళ ఎన్జీవోలు స్పందించారు.. రేపు మిగిలిన వారు కూడా నిలదీసే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు చూస్తే.. ఖజానా ఒట్టిపోయి కనిపిస్తోంది. ప్రతి మంగళవారం బాండ్లు వేలం వేస్తూ అప్పులు తెచ్చుకోవడానికి కూడా సర్కారు కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు ఆర్థిక వనరులు దండిగా సమకూర్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో జగన్ సర్కారుకు మరిన్ని కష్టాలు తథ్యమనే అంటున్నారు విశ్లేషకులు. మరి, ఈ పరిస్థితిని సీఎం ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి.