
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ వ్యవహారం ఊహించని మలుపుతో సాగుతోంది. హైకోర్టు తీర్పుతో ఎస్‌ఇసిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టగా, ఆయన నియామకం చెల్లదంటూ అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది జరిగిన కాసేపటికే ఎస్‌ఇసిగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్‌ఇసి కార్యదర్శి శనివారం అర్ధరాత్రి ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా ఎస్.రాంసుందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) కార్యదర్శిగా ఉన్న ఎస్.రాంసుందర్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.
అయితే, ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ పునర్నియామక ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్టు జారీచేసిన సర్క్యులర్‌పై జివిఎస్ ప్రభాకర్ (ఎఫ్‌ఎసి) సంతకం చేశారు.
మరోవంక, గత నెల 10న కొత్త ఎస్‌ఇసిగా తగిన వ్యక్తిని నియమించాలని ఫైల్లో పేరు లేకుండా గవర్నర్ ఆమోదం కోసం మధ్యాహ్నం 3.29కి సిఎస్ ఫైల్ సమర్పించారు. అదే రోజు సాయంత్రం 4.02కు ముఖ్యమంత్రి.. జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఇసిగా నియమించేందుకు బయోడేటాను గవర్నర్‌కు సమర్పించారు.
అంటే పేరు లేకుండానే తొలుత ఫైల్ నడిచినట్లు అర్థమవుతోంది. ఆర్డినెన్స్ జారీచేశాక రమేశ్‌కుమార్‌ను ఏప్రిల్ 10 నుంచి ఎస్‌ఇసిగా నిలుపుదల చేశారు. రాత్రి 9.45కి ఫైల్-3ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రారంభించి రాత్రి 10.07 గంటలకు డిజిటల్ సంతకం చేశారు.
ఇదిట్లా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన జి.వాణీమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సహకారశాఖ కమిషనర్‌గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు వెలువరించారు.
ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్, ఎపి డైరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీగా, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.