https://oktelugu.com/

AP Debt: అప్పుల్లో ఏపీ ప్రగతి పదం.. దేశానికి ఆదర్శం

ప్రతినెలా చివరి వారంలో ఏపీ నుంచి ఒక అధికార బృందం ఢిల్లీ వెళ్తుంది. అవసరమైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం వారి వెంట వెళ్తారు. అక్కడ ఉన్న తెలుగు మీడియా కంటపడరు.

Written By:
  • Dharma
  • , Updated On : November 1, 2023 / 02:28 PM IST
    Follow us on

    AP Debt: దేశంలో ఏపీకి ఇట్టే అప్పు పుడుతోంది. లక్ష రూపాయల ఆదాయం ఉంటే.. 3 లక్షల రూపాయల అప్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వార్షిక అనుమతులకు మించి అప్పు చేస్తున్నా కట్టడి చేయడం లేదు. ఇంకా ఉదారత కనబరుస్తూనే ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా అప్పుల మినహాయింపు ఇస్తున్నారు. అయితే ఈ అప్పు పుట్టించుకునే తారక మంత్రం జగన్ సర్కార్ వద్ద ఉండడం విశేషం. రాజకీయ పరస్పర ప్రయోజనాలను ఆశించే.. ఈ ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

    ప్రతినెలా చివరి వారంలో ఏపీ నుంచి ఒక అధికార బృందం ఢిల్లీ వెళ్తుంది. అవసరమైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం వారి వెంట వెళ్తారు. అక్కడ ఉన్న తెలుగు మీడియా కంటపడరు. ఆర్థిక శాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తారు. ఒప్పిస్తారు, నప్పిస్తారు.. ఎలాగోలా ఓ రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు సమ్మతి తీసుకుంటారు. గత నాలుగున్నర ఏళ్లుగా జరుగుతున్నది ఇదే. బహుశా ఈ విధానానికి అలవాటు పడ్డారు కాబట్టే.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వారికి క్యాబినెట్లో కొనసాగిస్తున్నారన్న టాక్ ఉంది. కొత్తవారు అయితే అప్పు పుట్టించలేరని, ఓపికగా తిరగలేరని భావించి జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం ఎప్పటినుంచో ఉంది.

    ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు ఉన్నాయని కేంద్రం మరిచిపోయిందో.. రాజకీయంగా అక్కరకు వస్తున్నారని భావిస్తుందో తెలియదు గానీ.. ఏపీకి మాత్రం ఇబ్బంది ముబ్బడిగా అప్పులు ఇచ్చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఎందుకు ఇస్తున్నారో కేంద్రం చెప్పడం లేదు. ఇచ్చిన సొమ్మును ఏం చేస్తున్నామోనని జగన్ సర్కార్ వెల్లడించడం లేదు. అప్పులు అంటే అది ప్రజాధనం. ఎప్పటికైనా కట్టాల్సింది ఏపీ ప్రజలే. కానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వ్యవహార శైలి ఏపీ ప్రజలకు శాపంగా మారుతుంది. పోనీ ఏమైనా ఏపీ ధనిక రాష్ట్రమంటే అది కాదు. దేశం మొత్తం మీద 20 శాతం మంది ప్రజలను పోషిస్తున్న ఉత్తరప్రదేశ్ ఉంది. ఆర్థికంగా బలమైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. కానీ కేంద్రం వాటిపై కరుణ చూపడం లేదు. ఏపీకి మాత్రం రుణాల వరద పారిస్తుండడం విశేషం.

    ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. కానీ ఇది ఆరు నెలల్లోనే ఆ మొత్తాన్ని అప్పు చేసింది. అయినా సరే ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రతి నెల రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల అప్పు తప్పడం లేదు. పోనీ ఈ అప్పును ఆదాయం పెంచుకునేందుకు ఏపీ సర్కార్ వినియోగిస్తుందా? అంటే అదీ లేదు. ఏపీ సొంత ఆదాయం 90 వేల కోట్లు.. అందులో మద్యం వాటా పాతిక వేల కోట్లు. మరి ఈ లెక్కన సాధించిన ప్రగతి ఏంటి? అప్పుల్లో మాత్రం దేశంలో కనివిని ఎరుగని ప్రగతి సాధిస్తున్న రాష్ట్రం ఏపీ. కానీ ఆర్థిక దివాలాతనానికి కేంద్రం ప్రోత్సాహం అందించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.