
AP Govt: విద్యుత్ సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి మందగించింది. దీంతో విద్యుత్ ప్లాంట్లు మూగబోనున్నాయి. విద్యుత్ కోతలు అమలులోకి రానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దసరా వరకు వేచి ఉన్న ప్రభుత్వం పండుగ తరువాత కోతలు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో కోతల అమలుకు సమయ వేళలు నిర్దేశం చేస్తోంది. దీంతో ప్రజలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితులు దాపురించాయి.
ఆంధ్రప్రదేశ్(AP Govt) లో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు మూగబోతున్నాయి. ఏపీలో జాతీయ విద్యుత్ ప్లాంటు (ఎన్టీపీసీ)తో పాటు మరో 8 ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. బొగ్గు సంక్షోభంతో ఇందులో విద్యుత్ ఉత్పత్తి కష్టంగా మారింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా విద్యుత్ కోతలు విధించేందుకే రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం విధించే కోతలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
అధికారికంగా కోతలు విధించేందుకు కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. త్వరలో కరెంటు కోతల వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. విద్యుత్ సంస్థలు ప్రకటించే దానిపై కోతలు ఉంటాయని చెప్పారు. పల్లెల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు, పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తరువాత కోతలు అమలులోకి వస్తాయని చెబుతున్నారు.
బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ కోతలు విధించడం అత్యవసరం అని తెలుస్తోంది. విద్యుత్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా కోతలు విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో, పట్టణాల్లో కోతలు విదించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు కూడా సహకరించాలని సూచిస్తున్నారు.