Huzurabad: హుజురాబాద్ నియోజకవర్గంలో ఓట్ల పండుగ జరుగుతోంది. దసరా కావడంతో వార్డు, గ్రామాలు, మండలాల వారీగా జనాభా ప్రాతిపదికన పలు కుల సంఘాలను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు పడ్డాయి. ఇంటింటికి చికెన్, మటన్ పంపుతున్నట్లు సమాచారం. ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే విందులు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పోటీ పడుతున్నాయి. పండుగల కంటే ముందే ప్రజల ముంగిట నిలిచి మర్యాదలు చేస్తున్నాయి.

పార్టీల్లో ప్రచారం జోరు తగ్గినా విందుల తీరు మారడం లేదు. ఓటర్లకు లోటు రానీయకుండా తమ ప్రభావం చూపిస్తున్నాయి. కోళ్లు, మేకలు, గొర్రెల్ని ఇంటికే పంపుతూ రాజకీయం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఆ ఏరియాల్లోని చికెన్, మటన్ కేంద్రాల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని మాంసాన్ని పంపిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు.
దీపావళి కంటే ముందే ఎన్నిక ఉండటంతో భారీ ఆఫర్లు ఇస్తున్నారు. దసరా పండుగ ప్రచారంలో భాగంగా దీపావళికి కానుకలు కూడా ఇస్తున్నారు. ఇదేమంటే పండుగ వేళ ప్రజలను సంతోషంగా ఉంచడమే లక్ష్యంగా పార్టీలు చెబుతున్నాయి. ఇందు కోసం స్వామి కార్యం స్వకార్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఓటర్లు పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ముఖ్య నేతలను రంగంలోకి దింపి ప్రచారం హోరెత్తిస్తున్నారు. జాతీయ నేతలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయం సాధించే క్రమంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పండుగలను వేదిక చేసుకుని ముందుకు సాగుతున్నారు.