AP Government: సాధారణంగా మన అవసరాలు క్యాబో, కారో బుక్ చేసుకుంటే ముందస్తుగా కొంత మొత్తం చెల్లిస్తాం. పని ముగిసిన తరువాత మిగిలిన మొత్తం చెల్లిస్తాం. ఆటొలు, బస్సులు ఎక్కినా వెంటనే టిక్కెట్లు చెల్లిస్తాం. కానీ తాము అందుకు అతీతులం అనుకున్నారో ఏమో కానీ.. సీఎం జగన్ కాన్వాయ్ కు పెట్టిన కార్లకు ఇంతవరకూ కిరాయి చెల్లించలేదు. సంబంధిత రవాణా అధికారులను అడుగుతుంటే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప చెల్లించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సీఎం జగన్ పర్యటనల సందర్భంగా కాన్వాయ్ కార్లకు చెల్లించాల్సింది అక్షరాలా రూ.18.11 కోట్లు. అయితే ప్రభుత్వం మీద భయంతో రవాణా శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ఎక్కడ తమకు ఇబ్బంది పెడతారోనని కార్ల యజమానులు బయటపడడం లేదు. కానీ ఇటీవల రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పినిపె విశ్వరూప్ తన శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బయటపడింది. సీఎం జిల్లాల పర్యటన జోరు పెంచుతున్నారని.. రెండేళ్లో పర్యటనలు ఎక్కువగా చేస్తారని.. ఆయన కాన్వాయ్ లో వాహనాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మంత్రివర్యులు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అయితే దీనిపై అధికారులు బిక్క ముఖాలు వేసుకోవడం కనిపించింది. ఎందుకలా నిరసించిపోయారని ప్రశ్నించిన మంత్రికి అధికారుల నుంచి ఎదురైన సమాధానాలు విస్మయపరిచాయి. వాహనాలు సమకూర్చడం మావల్ల కాదంటూ అధికారులు తేల్చిచెప్పడంతో మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. పాత బకాయిల గురించి ప్రస్తావించారు. 13 జిల్లాల్లో సీఎం పర్యటించినప్పుడు కాన్వాయ్ కు ప్రైవేటు వాహనాలను సమకూర్చామని.. మొత్తం రూ.18.11 కోట్లు పెండింగ్ లో ఉండిపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ముందుకు రావడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ముందుగా పాత బకాయిలు చెల్లిస్తేనే వాహనాలు సమకూర్చగలమని.. లేకుంటే పరిస్థితి కష్టమని తేల్చిచెప్పారు. అధికారుల సమాధానంతో మంత్రి విశ్వరూప్ కంగుతిన్నారు.

అత్యధికంగా నెల్లూరు జిల్లాలో..
జిల్లాల వారీగా పాత బకాయిల వివరాలను అధికారులు మంత్రి ముందుంచారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా రూ.ఆరున్నర కోట్లు పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం జిల్లాలో 4.66కోట్లు, శ్రీకాకుళం జిల్లా-1.50కోట్లు, చిత్తూరు జిల్లాలో 1.40కోట్లు, కృష్ణా జిల్లాలో 1.11కోట్లు ప్రైవేటు ఆపరేటర్లకు ప్రభుత్వం బకాయి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గానికీ చెల్లింపులు చేయడం లేదు. ప్రభుత్వ భవన నిర్మాణాలు, అభివ్రద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో చేయడం లేదు. ఇప్పుడు ఏకంగా సీఎం పర్యటనల్లో దర్పానికి, భద్రతా చర్యల్లో భాగంగా కాన్వాయ్ కు సైతం చెల్లింపులు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా కార్లు, జీపులకు సంబంధించి ఆపరేటర్లు రోజువారి వేతనదారుల జాబితాలోకి వస్తారు. అటువంటి వారికి సైతం మొండిచేయి చూపడం తగునా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు ప్రైవేటు వాహనదారులు కూడా కక్కలేక..మింగలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
Also Read: Electricity Employees: జీతాలు అడిగితే ఎస్మా..విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కారు ఝలక్
మేము రామంటే రాం..
కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు వాహనాలు అద్దెకు ఇవ్వకూడదని ప్రైవేటు వాహనదారులు నిర్ణయించుకున్నారు. అందుకే వాహనాలకు ఇబ్బంది ఎదురవుతోంది. రవాణా శాఖ అధికారుల ఆదేశాలు సైతం పాటించడం లేదు. మీ సొంత పనుల కోసమైతే చెప్పండి సార్.. ఎన్ని రోజులైనా వాహనాలు తిప్పుతాము కానీ.. ప్రభుత్వ కార్యక్రమాలకైతే రామంటూ తెగేసి చెబుతున్నారు. చేసేది లేక ఆర్టీఏ అధికారులు ప్రైవేటు వాహనాలను రోడ్లపై ఆపేసి బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. ఇటీవల ఒంగోలులో అర్ధరాత్రి తిరుమలకు వెళుతున్న భక్తులను నడిరోడ్డుపై దించేసి సీఎం జగన్ పర్యటన సందర్భంగా వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని సీఎంవో ఆదేశించింది. అయితే ఈ ఘటనతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే రవాణా శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రాధాన్యతాంశంగా భావించి సమీక్షించారు. కానీ అధికారుల నుంచి చుక్కెదురు కావడంతో షాక్ కు గురయ్యారు. అలాగని పాత బకాయిలు చెల్లించాలని ఆదేశాలివ్వలేదు. ఎలాగోలా సర్ధుకుపోయి సీఎం పర్యటనకు ఇబ్బంది లేకుండా చూస్తుకోవాలని మాత్రం అధికారులకు ఉచిత సలహా ఒకటి పడేశారు.
Also Read: Narendra Modi: మోడీనే టార్గెట్.. కాంగ్రెస్ మేథోమథనం
[…] […]