
AP Employees: పండుగ పూట కూడా పస్తులేనా అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న వేళ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఉద్యోగులను మాత్రం విస్మరిస్తోంది. దసరా పండుగ దగ్గరకొస్తున్న వేళ్ ఇంతవరకు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పండుగ పూట ఎలా అని మధనపడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.
పండుగకు అల్లుడైనా చుట్టాలైనా ఇంటికి వస్తే పరిస్థితి ఏంటి? వారికి కనీసం ఒక్క పూట భోజనం పెట్టే విధంగా కూడా లేదు. దీంతో ఉద్యోగులు(AP Employees) తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వం ఇలా చేస్తే తాము కూడా తగిన సమాధానం చెబుతామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు చెబుతున్నారు. అందరికి అన్ని ఇచ్చి తమను మాత్రం పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా నగదు అందజేస్తున్నా తమను మాత్రం నిర్లక్ష్యం చేయడం బాధాకరమే. ఇప్పటికే పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా వాటిని ఇవ్వకుండా ఇటు వేతనాలు చెల్లించకుండా సర్కారు నాటకాలాడుతోంది. ఫలితంగా ఉద్యోగులు తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని వాపోతున్నారు.
దసరా సందర్భంగా ఉండే ఖర్చులు ఎలా తీర్చుకోవాలి. కుటుంబ నిర్వహణ బాధ్యతను నెరవేర్చమెలా? అని వారిలో వారే తెగ బాధ పడుతున్నారు. ప్రభుత్వం జీతాల చెల్లింపులో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో సర్కారు విధానాలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్నింటికి ఉద్యోగులను బాధ్యులను చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ప్రకటిస్తున్నాయి.