‘క్షవరం అయితేనే గానీ.. వివరం తెలియదు’ అని ఒక ఫేమస్ సామెత. అవును నిజమే.. దెబ్బ తగిలితేగానీ తత్వం బోధపడదు. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సైతం ఈ సామెత అక్షరాలా సరిపోతుందని అంటున్నారు. కేసీఆర్ రాజకీయం పూర్తిగా తెలిసి నమ్మారో.. తెలియక విశ్వసించారో గానీ.. మొత్తానికి ఆయన్ను నమ్మారు. ఆ తర్వాత దెబ్బై పోయారన్నది విశ్లేషకుల మాట. జల జగడంలో కేసీఆర్ పెడుతున్న పేచీలు.. తీసుకుంటున్న నిర్ణయాలు చూసిన తర్వాత.. జగన్ కు అసలు విషయం తెలిసి వచ్చిందని అంటున్నారు. అయితే.. జగన్ కు పర్సనల్ గా ఇది మంచే చేసిందని కూడా అంటున్నారు కొందరు!
చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ కు కోపం ఉందన్నది బహిరంగ సత్యమే. అలాంటి చంద్రబాబు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండొద్దని బలంగా కోరుకున్నారు. ఆ విధంగా.. జగన్ గెలుపునకు పూర్తిగా సహకరించారు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించారు. ఈ స్నేహం ఇలాగే ఉంటుందని జగన్ భావించి ఉంటారు. కానీ.. రాజకీయం అంటే కేవలం అవసరమే కదా. అది తీరిపోయిన తర్వాత.. లెక్కలు మారడం మొదలు పెట్టాయి. దోస్తానా బాగానే ఉందని భావించిన జగన్ రాయల సీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టగా.. అది చట్ట విరుద్ధం అంటూ ఇప్పుడు పంచాయితీ మొదలు పెట్టి రచ్చ చేస్తున్నారు కేసీఆర్. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం.. లేఖల వార్ కొనసాగుతోంది. చివరకు పంచాయితీ సుప్రీం కోర్టుకు సైతం వెళ్లింది.
అయితే.. ఇద్దరు ముఖ్యమంత్రులూ వ్యూహంతోనే స్నేహం కొనసాగించి ఉండొచ్చు. కానీ.. కేసీఆర్ మాత్రమే పైచేయి సాధించారని చెబుతున్నారు. మిత్రుత్వాన్ని అడ్డుపెట్టుకొని విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాటాలను ఇవ్వకుండా తప్పించుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు మాత్రం నీటి పంచాయితీ తెరపైకి తెచ్చారు. దీంతో.. జగన్ కు వాస్తవం తెలిసి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్నేహం అనే భ్రమ నుంచి జగన్ బయట పడ్డ జగన్.. తమ రాష్ట్రానికి రావాల్సిన వాటిపై దృష్టి సారించారని చెబుతున్నారు. ఉదాహరణకు ఏపీకి విద్యుత్ బకాయిలు 6 వేల 112 కోట్లు రావాల్సి ఉందట. ఇవన్నీ వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అదేవిధంగా కేంద్రం నుంచి కూడా చట్ట ప్రకారం కోట్లాది రూపాయలు రావాల్సి ఉంది. ఇవన్నీ.. తెచ్చుకునేందుకు పార్లమెంటులో పోరాటం సాగించాలని ఎంపీలను ఆదేశించినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఏపీకి అత్యవసరం కూడా. అసలే.. లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం.. అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగుల జీతాలకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందువల్ల.. ఇటు తెలంగాణ నుంచి, అటు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాబట్టుకుంటే.. కొంతైనా ఆసరా అవుతుందని చూస్తున్నారట. మొత్తానికి.. జగన్ కు ఇప్పుడు వివరం తెలిసి వచ్చిందని అంటున్నారు. మరి, ఇందులో ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి.