
న్యాయస్థానం టెర్మినాలజీ విషయంలో చాలా మందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. కోర్టు ఇచ్చే స్టేలకు, మధ్యంతర ఉత్తర్వులకు, తుది తీర్పులకు మధ్య వ్యత్యాసం చాలా మంది తెలియదు. ఇది తెలియని వాళ్లంతా కోర్టు స్టే ఇచ్చింది అనగానే.. స్టే తెచ్చుకున్నవాళ్లు కేసు గెలిచేసినట్టుగానే భ్రమ పడుతుంటారు. మధ్యంతర ఉత్తర్వులను కూడా ఫైనల్ జడ్జిమెంట్ గానే భావిస్తుంటారు. కానీ.. తుది తీర్పు వస్తేనే.. న్యాయస్థానం కేసును పూర్తిగా విచారించినట్టు లెక్క.
ఏపీ సర్కారుకు న్యాయస్థానల్లో ఎదురు దెబ్బలు అంటూ పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎదురు దెబ్బ అనగానే సర్కారు కేసు ఓడిపోయిందనే అభిప్రాయం కలగడం సహజం. కానీ.. వాస్తవం ఏంటన్నది.. విషయం పూర్తిగా తెలుసుకుంటే తప్ప అర్థం కాదు. అయితే.. తమపై విచారణ జరగకుండా చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు స్టేలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎవరికైనా వచ్చే సందేహం ఒక్కటే. వాళ్లు తప్పు చేయనప్పుడు స్టే ఎందుకు తెచ్చుకున్నట్టు అని?
అయితే.. వాళ్లు స్టేలు తెచ్చుకున్నప్పటికీ.. వారు చేసిన పనులను మాత్రం ప్రజల ముందు ఉంచడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు వైసీపీ నేతలు. అమరావతి భూముల విషయం, అచ్చెన్నాయుడు ఈఎస్ఐ విషయం, సీఆర్డీఏ, విశాఖ భూ ఆక్రమణలు.. ఇలా చాలా అంశాల్లో టీడీపీ నేతలు, మాజీ మంత్రులు బెయిల్ పై ఉన్నారని, న్యాయస్థానాల్లో తుది తీర్పు రాకపోయినా.. వారు చేసిన పనులు మాత్రం జనాలకు తెలిసిపోయాయని అంటున్నారు.
విశాఖలో భూ కుంభకోణం ద్వారా రూ.5 వేల కోట్లు టీడీపీ నేతల చేతులు మారాయని, అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఇతర నేతల చేతుల్లో ఉన్న భూముల వివరాలను రిజిస్ట్రేషన్లతో సహా బయట పెట్టామని, ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల అక్రమాన్ని ప్రజలకు వివరించామని చెబుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఇది ఖచ్చితంగా విజయమేనని, వారి తప్పులను జనానికి అర్థం చేయించడం కన్నా కావాల్సింది ఏముందని అంటున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు జగన్ సక్సెస్ అయినట్టేనని అంటున్నారు.