YCP: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ దెబ్బతినడంతో ఆయన వైఫల్యాలను గుణపాఠాలుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా సిట్టింగులను మార్చకపోవడం వల్లే తెలంగాణలో ఓటమి ఎదురైందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇక్కడ కూడా సిట్టింగులను మార్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే 11మంది అభ్యర్థులను మార్చారు. ఈ జాబితా 80 మంది వరకు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో రెండో జాబితా సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం విడుదల చేసేందుకు హై కమాండ్ కసరత్తు చేస్తోంది.
మొదటి జాబితాలో.. ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్ కుమార్, కొండేపి కి ఆదిమూలపు సురేష్, వేమూరుకు వరికుటి అశోక్ బాబు, తాడికొండకు మేకతోటి సుచరిత, సంతనూతలపాడుకు మేరుగ నాగార్జున, చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ కు విడదల రజిని, అద్దంకికి పానెం హనిమిరెడ్డి, మంగళగిరి కి గంజి చిరంజీవి, రేపల్లెకు ఈవూరు గణేష్, గాజువాకకు వరికుట్టి రామచంద్రరావులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఇప్పుడు రెండో జాబితా సిద్ధమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థులను మార్చుతూ జాబితాను రూపొందించారు. ఇప్పటికే కొంతమంది సిట్టింగులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. వారిలో కొందరి మార్పు తప్పదని సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18, పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాపు, క్షత్రియ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ. ఇక్కడ జనసేన బలపడిందన్న అభిప్రాయం నేపథ్యంలో ఏకంగా అభ్యర్థులను మార్చడానికి వైసీపీ సిద్ధమైంది.
రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారని సమాచారం. సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మార్గాన్ని భరత్ కు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది సిట్టింగులకు ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. కొందరిని ఏకంగా పక్కకు తప్పిస్తారని టాక్ నడుస్తోంది. ఈ సాయంత్రానికి జాబితాను వెల్లడించేందుకు వైసీపీ కీలక నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఎటువంటి ప్రకంపనలకు దారితీస్తుందో చూడాలి.