CM Jagan: ఏపీ సీఎం జగన్ మరో యాత్రకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనకు కార్యరూపం తేనున్నారు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. వచ్చిన వెంటనే ఇడుపులపాలయ వెళ్లి తన తండ్రికి నివాళులర్పించి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి పాదయాత్ర కాకుండా ప్రజాయాత్ర లాగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇంతలో ఆయన అకాల మరణంతో కార్యక్రమం మరుగున పడిపోయింది. తన తండ్రి ఆలోచించిన రచ్చబండ కార్యక్రమానికి జగన్ కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి గాను ఒక కమిటీని కూడా నియమించినట్లు సమాచారం. ఈ కమిటీకి సీనియర్ నాయకుడు, మేనిఫెస్టో అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్ యువగళం, చంద్రబాబు జిల్లాల పర్యటన, పవన్ వారాహి యాత్రతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ తరుణంలో జగన్ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పాటు సీఎం జగన్ బస చేయనున్నారు. స్థానిక ప్రజలతో మమేకం కానున్నారు. అటు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను పర్యవేక్షించనున్నారు. పార్టీలో అసంతృప్తులు, విభేదాలు, వర్గాలు ఉంటే సర్దుబాటు చేయనున్నారు. అన్నీ కుదిరితే ఈ నెల చివరి వారంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగున్నర ఏళ్ళు అవుతుంది. సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అయితే అభివృద్ధి లేదన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ సుదీర్ఘకాలం రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలను రూపొందించి వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నాటి పాదయాత్ర మాదిరిగా.. ఇప్పుడు చేయాలంటే కుదరదు. చాలా వర్గాలకు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. వాటన్నింటికీ నవరత్నాలు పరిష్కార మార్గంగా చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. అందుకే నియోజకవర్గానికి రెండు రోజులు పాటు రచ్చబండ కార్యక్రమం ద్వారా కేటాయిస్తారని తెలుస్తోంది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణ ప్రారంభమవుతుంది. రచ్చబండ షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది.