CM Jagan : ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధే ఉండడంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. వీలైనంత వరకూ ప్రజల్లోనే ఉండాలని అటు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. తాను సైతం ఈ ఏడాది పాటు ప్రజల్లో ఉండాలని డిసైడయ్యారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే గడపగపడకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో యంత్రాంగం మొత్తాన్ని గ్రామాలు, పట్టణాల్లో మొహరిస్తున్నారు. అటు జగనన్న నువ్వే మా నమ్మకం… జగనన్న నువ్వే మా భవిష్యత్ కార్యక్రమాన్ని దిగువస్థాయిలో పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. ఇంటింటా స్టిక్కర్లు అతికించే కార్యక్రమం కొనసాగుతోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేశారు. ప్రభుత్వంపై వారిలో నెలకొన్న అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
జిల్లాల పర్యటనకు సిద్ధం..
అటు పార్టీ శ్రేణులు బిజీగా ఉండగా.. ఇప్పుడు జగన్ జనాల మధ్యకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. మే చివరి వారంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఏడాది ముందు నుంచే ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలకు పూనుకుంటోన్నారు. దీనికి సంబంధించిన కసరత్తును పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేస్తోంది.26 జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో కనీసం 10 రోజుల నుంచి 14 రోజుల వరకుక పర్యటించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేయడం, వాటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తారని పార్టీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తత్వం బోధపడడంతో..
తొలి మూడేళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ అడుగు బయటపెట్టలేదు. కొవిడ్ ఇతరత్రా కారణాలతో ప్రజలకు దూరంగా గడిపారు. వరుస ఎన్నికల్లో విజయంతో అంతులేని ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజాబలం తమకే ఉందని భావించారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో తత్వం బోధపడింది. పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని గ్రహించారు. అందుకే ప్రజల మధ్యలోకి వెళ్లకపోతే మూల్యం తప్పదని భావిస్తున్నారు. కేవలం సంక్షమమే గట్టెక్కించదని తెలుసుకున్నారు. ప్రజల మధ్య సంక్షేమ పథకాల బటన్ నొక్కేందుకు సిద్ధపడుతున్నారు. మొన్న అనంతపురం జిల్లా నార్పలలో వసతి దీవెన కార్యక్రమం సక్సెస్ కావడంతో.. ఇక నుంచి ఎటువంటి పథకం అయినా ప్రజల మధ్య నుంచే ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
వెనుబడిపోతామని.,..
చంద్రబాబు సైతం జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ఇప్పటికే చాలా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల సభలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆయన సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర సైతం సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. బాదుడేబాదుడు, ఇదేంఖర్మ కార్యక్రమాలతో టీడీపీ శ్రేణులు సైతం యాక్టివ్ గా తిరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బయటకు రాకుంటే వెనుకబడిపోతామన్న బెంగ జగన్ లో కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో ధిక్కార స్వరాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, వివేకానందరెడ్డి హత్య కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే జిల్లాల్లో పర్యటించి కాస్తా రిలాక్స్ అవుదామన్న భావనలో జగన్ ఉన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమాంతరంగా చేసి ఎన్నికలకు శంఖం పూరించడానికి డిసైడ్ అయ్యారు.