ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కేంద్రంతో సన్నిహితంగా మెలగటానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మొండిగా ముందుకెళతారనే సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే మాత్రం జగన్ సర్కార్ ఒకటికి రెండుసార్లు ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. కోర్టులతో సైతం పోరాడుతున్న జగన్ సర్కార్ బీజేపీకి అనుకూలంగా ఉండేందుకు ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం.
Also Read : తెలంగాణలో పొలిటికల్ హీట్
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తరువాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. అయితే జగన్ సర్కార్ చేసిన ప్రకటనపై టీడీపీ, బీజేపీ, జనసేన తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే అమలు చేస్తే తెలుగు మీడియం చదివే విద్యార్థులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నాయి.
అనంతరం పలువురు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించగా కోర్టుల్లో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగానే తీర్పులు వెలువడ్డాయి. అయినా సీఎం జగన్ మొండిగా ముందుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా కేంద్రం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని పేర్కొంది.
తెలుగు మీడియం ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని ఆలోచించిన జగన్ సర్కార్ కు ఈ నిర్ణయం ఒకింత షాక్ కు గురి చేసింది. అయితే కేంద్రం నిర్ణయానికి ఎదురెళ్లలేక జగన్ సర్కార్ 5+3+3+4 విధానంలో విద్య అమలు చేయనున్నట్టు ప్రకటన చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో బీజేపీ జాతీయ విద్యా విధానంతో ఇచ్చిన షాక్ వల్ల జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Also Read : కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?