
భారీ వర్షాలు.. భారీ వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. నగరాలను ముంచెత్తాయి. ఎక్కడికక్కడ రోడ్లు డ్యామేజీ అయ్యాయి. జనజీవనం స్తంభించింది. వేలాది కాలనీల ప్రజలు నీటిలోనే ఉండిపోయారు. అటు పొలాల్లో నీరు చేరి రైతులూ తీవ్ర నష్టాన్నే చవిచూశారు. చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయని రైతులు లబోదిబోమంటున్నారు. మరి ప్రభుత్వాలు వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: జగన్‌కు కేంద్రం ఝలక్.. దిశ చట్టం అమలుకు బ్రేక్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలను ఆదుకునే పరిస్థితుల్లో లేవు. పెను ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే.. వెంటనే భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వివరాలు పంపించాలని మోడీ అడగ్గానే.. వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మందికిపైగా మృతి చెందారని, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల డ్యామేజీ, విద్యుత్‌శాఖకు తీరని నష్టం జరిగిందని తేల్చారు. అధికారులతో సమీక్ష ముగిసిన వెంటనే కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని.. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు ఇవ్వాలని లేఖలో కోరారు.
అదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. కానీ వరదలపై మాత్రం కాదు. వరద నష్టంపైనా కాదు. వరదల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి అంతకన్నా కాదు. మున్సిపాలిటీల్లో చేయాల్సిన సంస్కరణల గురించి సమీక్షించారు. అక్రమ లేఔట్లను గుర్తించి రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. మరి రైతుల గురించి ఎవరు పట్టించుకుంటారు..? తెలంగాణలో 9 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే.. ఏపీలో ఆ నష్టం 20 లక్షల ఎకరాల వరకూ ఉంటుందని అంచనా వేశారు.
Also Read: వైసీపీ వర్సెస్ టీడీపీ: ఏపీలో ‘బురద’ రాజకీయం!
కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నింపాదిగా వ్యవహరిస్తోంది. స్వయంగా ప్రధాని ఫోన్ చేసినా ఏపీలో అంతా సాధారణ పరిస్థితే ఉందని తేల్చి చెప్పేసినట్లుగా మీడియాకు చెప్పారు. అంటే.. ఏపీలో వరదను ఏపీ సర్కార్ లైట్ తీసుకున్నట్లే కదా. ఇక్కడ సీఎం జగన్ లాజిక్ మిస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. వర్షాలు పడ్డాయంటే కేంద్రం నుంచి ఆరా తీస్తారు. వారు ఆరా తీశారంటే ఎంతో కొంత సాయం చేద్దామనే. ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అదే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసినా.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఎందుకు లైట్ తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి.