
నేటి నుంచి 45 సంత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా గురువారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన టీకా తీసుకున్నారు. సీఎం జగన్‌తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం ఇద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఈ సందర్భంగా వార్డు సచివాలయంలోని వాలంటీర్లు, అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడారు. దేశవ్యాప్తంగా గురువారం కరోనా వ్యాక్సినేషన్ మూడో విడత ప్రారంభమైంది. రెండో దశలో 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకనుంచి దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని.. సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లాలి. కోవిన్ పోర్టల్‌లో, ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు, క్లినిక్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చార్జి చేస్తారు. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. ఈ ఏడాది జనవరిలో దేశంలో మొదటి విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మొదటి విడతలో హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ చేశారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇచ్చారు. తాజాగా మూడో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి కూడా టీకా ఇవ్వనున్నారు. దేశంలో ఇప్పటివరకూ 6.30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.