తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన వాటర్ వార్ ఇంకా చల్లారలేదు. రాయలసీమ లిఫ్ట్ అక్రమంగా నిర్మిస్తోందని విమర్శించిన తెలంగాణ.. జల విద్యుత్ చేపట్టడంతో పంచాయితీ మరో దశకు చేరింది. ఇరు రాష్ట్రాలు, కృష్ణా బోర్డు మధ్య లేఖల సమరం సాగుతోంది. ఈ క్రమంలో మాట్లాడిన ఏపీ సీఎం జగన్.. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి లిఫ్టులను ప్రశ్నించారు. దీంతో.. గొడవ ముదిరిందే తప్ప, తగ్గలేదు. రెండు రాష్ట్రాలతో కృష్ణాబోర్డు సమావేశం అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. అసలు ముఖ్యమంత్రులిద్దరూ కలిసి మాట్లాడుకొని, సమస్య పరిష్కరించుకోవచ్చుకదా..? ఈ కొట్లాట ఎందుకు? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడంతో.. ఈ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది కూడా.
అయితే.. ఇంత జరుగుతున్నా, కూర్చొని మాట్లాడుకుందాం అనే మాట రెండు రాష్ట్రాల్లో ఎవరినుంచీ రాకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. మొదట ఈ పంచాయితీని తెరపైకి తెచ్చింది కేసీఆరే. కేబినెట్ భేటీలో ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. అప్పటి నుంచి మంత్రులు అందుకోవడం.. ఏపీ కౌంటర్లు ఇవ్వడంతో.. గొడవ పెరిగి పెద్దదైంది. అయితే.. చిత్రంగా ఆ తర్వాత నుంచి మౌనాన్ని ఆశ్రయించారు కేసీఆర్. అటు జగన్ కూడా చాలా రోజులు సైలెంట్ గా ఉండి.. తాజాగా స్పందించారు. తాము ప్రాజెక్టులు నిర్మించడం తప్పుకాదని, మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా? అంటూ తెలంగాణలోని ప్రాజెక్టులను ప్రస్తావించారు.
ఇలా.. రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కౌంటర్లు, ఎన్ కౌంటర్లు చేసుకుంటున్నారే తప్ప.. సామరస్యపూర్వక చర్చలకు మాత్రం ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దీనికి కారణం ఏంటని ఆరాతీసినప్పుడు.. హుజూరాబాద్ ఎన్నిక కనిపిస్తోందని అంటున్నారు. ఈటల రాజేందర్ స్థానికంగా ఎంత బలమైన నేత అన్నది ఆయన రాజీనామా చేసిన తర్వాతే అందరికీ తెలిసి వచ్చింది. అలాంటి నేతను అక్కడ ఓడించడం అంత సులభంగా అయ్యే పనికాదు. పైపెచ్చు ఆయన బీజేపీలో చేరారు. కాబట్టి ఇంకా బలం పెరిగింది. అందువల్ల.. ఈటలను ఓడించేందుకు మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగించారని, దాని ఫలితమే ఈ జలజగడం చర్చకు వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
ఈ పంచాయతీ ముదరడంతో తెలంగాణను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు భావిస్తారని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో.. నీటి పంచాయితీని పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకోకపోవడం వల్ల బీజేపీ కూడా తెలంగాణకు ఏమీ చేయట్లేదు అని పరోక్షంగా ప్రజలకు చెప్పాలని గులాబీ అధినేత తలపోస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా అటు బీజేపీని అడ్డుకోవడం.. ఇటు ఈటలకు చెక్ పెట్టడానికే.. నీటి సమస్యను నెత్తికి ఎత్తుకున్నారని అంటున్నారు. దీనికి ఏపీ సీఎం జగన్ కూడా సహకరిస్తున్నారని, అందుకే.. నేరుగా చర్చలు చేయడం వంటి అంశాలను ముందుకు తేవట్లేదని అంటున్నారు. ఇలా చూస్తే.. ఇద్దరు సీఎంల భేటీ, తద్వారా జల జగడానికి ముగింపు పలకడం అనేది హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ap cm jagan and telangana cm kcr will meet after huzurabad by election
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com