Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మరో కీలక పరిణామం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఇంతలో రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబుకు ఉపశమనం దక్కినట్టు అయింది.
అయితే చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు తీర్పున సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం విశేషం. మంగళవారం దీనిపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపించిన నేరానికి సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టు సమర్పించలేకపోయిందని హైకోర్టు తెలిపింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను రిమాండ్ విధించాలని కోరడానికి ముందే సిఐడి చూపించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దర్యాప్తులో లోపంగా భావిస్తూ బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్ పై ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
చంద్రబాబు వైద్యం చేయించుకున్న ఆసుపత్రి, చికిత్సలకు సంబంధించిన వివరాలను, మెడికల్ రిపోర్టులను ఈనెల 28లోగా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులను సైతం కోర్టు సడలించింది. చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ఈ షరతులు ప్రభావం చూపుతాయని.. అందుకే ఈనెల 31 వరకు కాకుండా.. 29 నుంచి సడలిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు.అయితే కోర్టు బెయిల్ మంజూరు విషయంలో కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేసింది. అవి కేసు నిలబడవన్న కోణంలో చేసినవి కావడంతో ఏపీ సిఐడి సీరియస్ గా తీసుకుంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి డిసైడ్ అయ్యింది.