New Districts And Revenue Divisions: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాలకు కలెక్టర్లను కూడా నియమించింది ప్రభుత్వం. మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్, శ్రీకాకుళం శ్రీకేశ్ బాలాజీ రావు, విజయనగరం సూర్యకుమారి, మన్యం నిశాంత్ కుమార్, విశాఖపట్నం మల్లికార్జున, అనకాపల్లి రవి సుభాష్, కాకినాడ కృతికా శుక్లా, తూర్పుగోదావరి మాధవీలత, కోనసీమ హిమాన్షు శుక్లా, పశ్చిమగోదావరి ప్రశాంత్, ఏలూరు ప్రసన్న వెంకటేశ్, కృష్ణా రంజిత్ బాషా, ఎన్టీఆర్ ఎస్. దిల్లీరావు, గుంటూరు వేణుగోపాల్ రెడ్డి, పల్నాడు శివశంకర్, బాపట్ల విజయ, ప్రకాశం దినేష్ కుమార్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై వర్చువల్ గా భేటీ అయిన కేబినెట్ చిన్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లాల ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
26 జిల్లాలు 73 రెవెన్యూ డివిజన్లతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారనున్నాయి. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభుత్వం నూతన జిల్లాల కోసం కొన్ని మార్పులు చేసినా చివరకు ఒక రూపుకు మాత్రం ఓకే చెప్పింది. దీంతో కొత్త జిల్లాల్లో పనులు నిర్వహించేందుకు పకడ్బందీగా తయారు అయింది.
కొత్త జిల్లాలకు భవనాలు సమకూర్చారు. అందులో అరకొర వసతులున్నా ప్రస్తుతం సర్దుకుపోవాలని చూస్తోంది. మెల్లమెల్లగా వసతుల కల్పనకు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకుంది. అందుకే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ముమ్మరంగా పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 4నుంచి పనులు శరవేగంగా జరిపేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. పాత డివిజన్లలో పనులు అలాగే కొనసాగుతుండగా కొత్త వాటిలో పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
Also Read:AP New Districts: కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రక్రియ ప్రారంభమేనా?