
బ్రాహ్మణ కార్పొరేషన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఈ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమ శాఖలో కలుపుతూ గెజిట్ జారీ చేసింది. దీనిపై ఇటు బీసీ వర్గాలతోపాటు అటు బ్రాహ్మణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే..ఇలా బీసీ సంక్షేమ శాఖలో కలపాలని బ్రాహ్మణులెవరూ ప్రభుత్వాన్ని కోరిందిలేదు. ఇందుకు ప్రాతిపదిక ఏంటన్నదీ వారు అంచనా వేయలేక పోతున్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ ం ఈ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమశాఖలో కలిపిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. దీంతో ఈ కార్పొరేషన్ కు ఏ పథకం కింద నిధులు కేటాయించినా.. భక్తుల కానుకల ద్వారా దేవాదాయ శాఖకు సమకూరిన నిధులను దారిమళ్లిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో అమ్మఒడి వంటి పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న బ్రాహ్మణులకు కూడా సాయం అందించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమ శాఖలో కలపాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు భావిస్తున్నారు.
ఇప్పటికే బీసీ కార్పొరేషన్ల కు పలు పదవులు ప్రకటించిన ప్రభుత్వం.. వాటికి నిధులు మాత్రం కేటాయించడంలేదు. అమ్మ ఒడి లాంటి పెన్షన్లను ఈ కార్పొరేషన్ల ఖాతాలో వేసి లబ్ధిదారులకు బదిలీ చేస్తున్నారు. ఇకపై బ్రాహ్మణులకు కూడా ఇలాగే పెన్షన్లు వంటివి ఈ శాఖ ద్వారా బదిలీ చేయనున్నారు. దీంతో దేవాదాయ శాఖ నిధులను దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలకు కూడా తావివ్వకుండా ఉండవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.