AP BJP Strategies: ఇల్లు అలకగానే పండుగ కాదు.. కేంద్రంలో అధికారంలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి రాజ్యాధికారం అయాచితంగా రాదు.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కేంద్రంలో అధికారం ఉండి.. అవసరమైన అండదండలు అందిస్తున్నా కూడా ఏపీలో బీజేపీ కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఎదగలేకపోతోంది. కారణమేంటి. నాయకుల్లో అనైక్యత.. నాయకత్వ వైఫల్యం అని కొందరు అంటున్నారు. ఏపీలో బీజేపీ వ్యూహాలే సరిగ్గా లేవని మరికొందరు అంటున్నారు. ఏపీ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అధికారానికి లేదా బీజేపీ ఎదుగుదలకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి మరి బీజేపీ ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? ఎలాంటి రాజకీయం చేస్తే బీజేపీ ఏపీలో బలోపేతం అవుతుంది. రాజ్యాధికారానికి చేరువ అవుతుంది? ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎలా ఉండాలనే దానిపై స్పెషల్ ఫోకస్..
* ఆంధ్రలో పరిస్థితి ఏమిటి? బీజేపీకి వ్యతిరేక వాతావరణమేనా?
ఉమ్మడి ఏపీని విడగొట్టి నామరూపాల్లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ సహా ఎంతోమంది పేరున్న నేతలున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అసలు ఎదురేలేకుండా ఉండేది. ఏపీ ఏర్పడినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించింది. రాష్ట్రం విడిపోక ముందు వరకూ బలమైన నేతలు ఆ పార్టీకి ఉన్నారు. అయినా కూడా ఒక్క విభజన ఏపీలో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేసింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఇక్కడ బలం పుంజుకోవడం లేదు. ఏపీలో బీజేపీకి అనువైన వాతావరణం లేదనే చెప్పాలి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. పోలవరంకు సరిపడా నిధులు కేటాయించలేకపోవడం.. విభజన హామీల్లో కేంద్రం నుంచి సరిగ్గా నిధులు రావడం లేదన్న ప్రచారం సాగడంతో ఆంధ్రా రాజకీయాల్లో బీజేపీ ఎదగలేకపోతోంది. వాటినే బూచీగా చూపి ప్రతిపక్షాలు, అధికార పక్షం బీజేపీని టార్గెట్ చేసి ఎండగడుతున్నాయి. దీంతో ఏపీలో బీజేపీకి ప్రస్తుతానికి వ్యతిరేక వాతావరణమే ఉంది. మరి ఈ వ్యతిరేకత పోవడానికి బీజేపీ ఏం చేయాలన్నది ఇప్పుడు అసలు ప్రశ్న..
*బీజేపీ ఏమి చేయాలి? తెరవెనుక ఉండి నడిపించాలా?
ఏపీలో బీజేపీకి సొంతంగా అధికారం దక్కడం కష్టమేనని తేలిపోయింది. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? అంటే సింపుల్.. ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్షాలకు వెన్నుదన్నుగా సపోర్టింగ్ రోల్ పోశిస్తూ వారు అధికారంలోకి రావడానికి పాటుపడాలి. కేంద్రంలో అధికారం ఉండడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఏపీలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ లేదా వైసీపీల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకొని జనసేనతో కలిసి అధికారం పంచుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తమిళనాడులో అన్నాడీఎంకేను ముందుపెట్టి బీజేపీ చక్రం తిప్పినట్టుగా ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీని గుప్పిట పట్టి బలాన్ని పెంచుకొని తన అధికారాన్ని చెలాయించడం మాత్రమే బీజేపీ ముందున్న ఏకైక ఆప్షన్. లేదంటే జనసేనను ముందు నిలిపి ఆ పార్టీకి అన్ని అండదండలు అందించి అధికారంలోకి వచ్చేలా చేయడం ముఖ్యం. ఏపీలో ముందుండి బీజేపీ రాజకీయం చేయడం కంటే ఏపీలో సెకండరీ పార్టీగా వెనుకుండి ఏదో ఒక బలమైన పార్టీని ముందుపెట్టి రాజకీయం చేయడమే బెటర్ అని విశ్లేషకులు సూచిస్తున్నారు.
* పవన్ కు పోటీగా కాదు.. ప్రోత్సహించే నేత అవసరం
జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాపు సామాజికవర్గం నుంచి నేతగా ఉన్నారు. ఆయన నాకు కుల పట్టింపులు లేవని ఎంత అన్నా కూడా కాపులంతా ఆయనను తమ వాడిగానే ఓన్ చేసుకుంటారు. ఇలాంటి టైంలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ… పవన్ ను మరింత ప్రోత్సహిస్తూ ఆయన మద్దతుగా నిలబడి రాజకీయం చేయాలి. కానీ కౌంటర్ గా పవన్ సామాజికవర్గానికి చెందిన నేతనే ఏపీ బీజేపీ చీఫ్ ను చేయడం కరెక్ట్ కాదన్న భావన వ్యక్తమవుతోంది. పవన్ ను ముందు పెట్టి తెరవెనుక బీజేపీ రాజకీయం చేస్తే ఈ రెండు పార్టీలకు ఏపీలో మంచి అవకాశం ఉంటుంది. ఆల్ రెడీ పవన్ ఉండగా.. ఆయనకు పోటీగా మళ్లీ అదే సామాజికవర్గం నేతను బీజేపీ చీఫ్ ను చేయడం బీజేపీకి మైనస్ అని అంటున్నారు. కాపు ఓట్లను పవన్ ద్వారా ఆకర్షించాలి. ఇతర సామాజికవర్గాలను ఆకర్షించాలంటే బీజేపీ ఆయా బలమైన వర్గాల వారికే పగ్గాలు అప్పజెప్పాలి. వారిని కూడా తమవైపు తిప్పుకునే విధంగా చేయాలి. అదే సమయంలో పవన్ ను ముందుపెట్టి వెనుకలా నడిచేలా బీజేపీ చేస్తే ఈ రెండు పార్టీలకు ఏపీలో మెరుగైన అవకాశాలుంటాయి. కాపులంతా బీజేపీలో ఉండి అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌కు సవాలుగా మారడం తప్పుడు వ్యూహంగా చెబుతున్నారు.
*నడిపించే నాయకుడే కావాలి..
ఏ పార్టీ అయినా తీరం చేరాలంటే నడిపించే నాయకుడు ముఖ్యం. 2004లో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనసు గెలిచి సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా అలానే అధికారం సాధించారు. ప్రజల్లో పాపులారిటీ గల నేతను వెతికి పట్టుకొని అతడికి పగ్గాలు అప్పజెప్పి బలంగా ప్రజల్లోకి వెళ్లడం అన్నింటికంటే ముఖ్యం. తెలంగాణలో కాంగ్రెస్ అదే పనిచేసింది. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పింది. బీజేపీకున్న ప్రధాన భావజాలాన్ని ఓన్ చేసుకొని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే నేత ఏపీలో ఆ పార్టీకి అవసరం. అలాంటి నాయకుడిని వెతికి అతడికి పగ్గాలు అప్పగించి ప్రొజెక్ట్ చేయడం ద్వారా కనీసం బీజేపీ పునాదులు ఏపీలో బలంగా నాటేలా చేయవచ్చు. పార్టీ రాష్ట్రంలో ఎదగడానికి ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం ఏపీలో సీఎంగా ఉన్న జగన్ రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం తెలుగు ప్రజల్లో విస్తృతంగా ఉంది. ఇలాంటి టైంలో దానికి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. జగన్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకునే నేతను బీజేపీ ఒడిసిపట్టాలి. అప్పుడే ఆ పార్టీకి ఏపీలో మెరుగైన అవకాశాలుంటాయి.
*అక్కడ యోగి ఆధిత్యనాథ్.. ఇక్కడ పరిపూర్ణానంద లాంటి వారు కావాలా?
బీజేపీ బలంగా తయారవ్వాలంటే ముందుగా ఆ పార్టీ సిద్ధాంతాలను, భావాలను నరనరాన ఎక్కించుకున్న నేత అవసరం. అప్పుడే బీజేపీ ఏపీలో బలోపేతం అవుతుంది. ఆ దిశగా బీజేపీ అధిష్టానం చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. నాయకత్వం అనేది బీజేపీకి అత్యంత అవశ్యమైన అంశం. యూపీలోని బలమైన హిందుత్వ, కుల రాజ్యంలో యోగి ఆదిత్యనాథ్ ను దించి బీజేపీ చేసిన ప్రయోగం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఏపీలోనూ బీజేపీలో చేరిన పరిపూర్ణానంద లాంటివారిని ప్రోత్సహించి పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా ఆంధ్రాలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. పరిపూర్ణ లాంటి బలమైన నేతలను ఏపీలో ఎందుకు ఎంక రేజ్ చేయడం లేదన్నది బీజేపీ అధిష్టానం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఆంధ్రాలో బీజేపీ బలపడే ఛాన్స్ ఉంది.
మొత్తంగా బీజేపీ ఏపీ వ్యూహాలు సరిగా లేవని అర్థమవుతోంది. వారు రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రాలేరని తెలిసినప్పుడు వచ్చే పార్టీతో కలిసి సెకండ్ రోల్ పోశిస్తూ ముందుకు సాగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ మిత్రపక్షాన్ని ఏవిధంగా అధికారంలోకి తేగలదో ఆలోచించాలి. ప్రత్యామ్మాయంగా తెరవెనుక శక్తిగా ఉండి నడిపించాలి. 2024 వరకూ సపోర్టింగ్ రోల్ గా ఉండి జనసేనను ముందుకు తోసి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వచ్చేసారి ఈ కూటమికి మెరుగైన అవకాశాలుంటాయి. ముందుగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారనే విషయంలో స్పష్టత ఉండాలి. 2024కి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటుందా? అంత బలం క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉందా అని పునరాలోచించాలి. బలం లేదని తెలిసినప్పుడు సహాయక పాత్ర పోషించి తన మిత్రపక్షాన్ని అయినా అధికారంలోకి తీసుకురాగలగాలి. సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఈ దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తేనే ఆ పార్టీకి ఏపీలో భవిష్యత్ ఉంటుంది. ఆ దిశగా బీజేపీ పెద్దలు తమ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ap bjp strategies what should be the role of bjp in ap politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com