
యాక్సిడెంట్ అంటే ఏంటో.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో డెఫినిషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. ‘‘ఒకరు కిందపడిపోవడం కాదు.. ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోవడం’’అని. అయితే.. సినిమా ప్రాజెక్టుల విషయంలోనూ యాక్సిడెంట్లు జరుగుతాయని, దానివల్ల యాక్సిడెంట్లో ఉన్నవారికే కాదు.. సంబంధం లేనివాళ్లకూ దెబ్బలు తగులుతాయని ఇప్పుడు తిప్పి రాసుకోవచ్చు!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా యాక్సిడెంట్ కు గురవడంతో అది ఆగిపోయింది. కానీ.. ఈ యాక్సిడెంట్ వల్ల సంబంధం లేని ఇతరులు కూడా గాయపడడమే.. ఇక్కడ అసలు విషయం! అయితే.. పైకి అంతా స్నేహపూర్వకంగానే జరిగిందని ప్రచారం సాగుతున్నప్పటికీ.. లోపల మాత్రం వేరే ఉందని అంటున్నారు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో జరిగిందన్నది కేవలం బయటకి తెచ్చిన ప్రచారమేనని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోవడంతో.. ముందు త్రివిక్రమ్ గాయపడ్డాడు. ‘ఆచార్య’ తర్వాత బన్నీతో సినిమా చేయాల్సిన కొరటాల శివ.. ఉన్నఫలంగా జూనియర్ దగ్గరకు వెళ్లిపోయాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. దీంతో.. అల్లు అర్జున్ బాగానే హర్ట్ అయ్యాడని అంటున్నారు. తనకు కమిట్ అయి, ఇప్పుడిలా వెళ్లిపోవడంపై గట్టిగానే ఫీలయ్యాడని చెబుతున్నారు.
కొరటాల ఎన్టీఆర్ వద్దకు వెళ్లిపోవడమనే విషయం సోషల్ మీడియాలో కూడా చర్చజరిగింది. అయితే.. నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు ‘యువసుధ’ సంస్థ ఓ ట్వీట్ చేసింది. బన్నీ-కొరటాల సినిమా ఉందని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమవుతుందన్నది దాని సారాంశం. అయితే.. ఇది ప్రస్తుత వాతావరణాన్ని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నమేనని అంటున్నారు.
జూనియర్ తో సినిమా క్యాన్సిల్ అవడంతో త్రివిక్రమ్-మహేష్ మూవీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫామ్. అనౌన్స్ మెంటే మిగిలింది. అయితే.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్-బన్నీ కాంబో సెట్ అవుతుందని అంటున్నారు. దీన్ని బట్టి కొరటాల-బన్నీ కాంబో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. మరి, ఏం జరుగుతుందని చూడాలి.