Purandeswari: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం పురంధరేశ్వరి తొలిసారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈనెల 27న విశాఖపట్నంలో ఆమె పర్యటించబోతున్నారు. పదాధికారులతో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.
ఉక్కు సవాల్
ఇటీవల పురంధరేశ్వరి విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఆమె విలేకరులతో పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వం పని తీరుపై నిప్పులు చేరి గారు. గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా ప్రకటించారు. అయితే ఇదే సమయంలో విశాఖ ఉక్కు కర్మ గారానికి చెందిన కార్మిక సంఘం ప్రతినిధులు ఆమెను కలిశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు ముందుకు వేస్తోందని, దీనిని అడ్డుకోవాలని ఆమెకు విన్నవించారు. దీనిపై ఆమె ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు. అయితే త్వరలో ఆమె ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్కు కర్మాగారం గురించి ఆమెకు సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కార్మికులు సిద్ధం
ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్కు కర్మాగారం గురించి మరొకసారి విన్నవించాలని కార్మికులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉక్కు కర్మ గారం ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతోందని కార్మికులు అంటున్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకరించడం వల్ల తాము ఉపాధి కోల్పోతామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పలు దేశాలకు ఉదారంగా సహాయం చేస్తుందని, ఇదే సహాయాన్ని ఉక్కు కర్మకారానికి చేస్తే తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని, కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొన్నాయని కార్మికులు గుర్తు చేస్తున్నారు. అయితే రాష్ట్ర పార్టీగా దీనిని అడ్డుకుంటే తమకు లాభం జరుగుతుందని కార్మికుల భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉక్కు కర్మాగార సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కార్మికులు పురంధరేశ్వరిని కోరుతున్నారు.
మైలేజ్ దక్కే అవకాశం
ఒకవేళ కార్మికులు ప్రస్తావించిన విషయాన్ని కేంద్రం దృష్టికి పురంధరేశ్వరి తీసుకెళ్తే అది అంతిమంగా ఆ పార్టీకి లాభం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో కొద్దో గొప్పో బిజెపికి పట్టు ఉందని, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో సభ్యుడు కావడం ఆ పార్టీకి అదనపు బలమని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు పురంధరేశ్వరి ఉక్కు కర్మాగార సమస్యను పరిష్కరించినట్లయితే పార్టీకి లాభం జరుగుతుందని వారు చెబుతున్నారు. మరి ఈ సమస్యను పురంధరేశ్వరి అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.