తిరుపతి ఉప ఎన్నికవేళ విడుదలైన వకీల్ సాబ్ చిత్రం.. ఎన్నికల ప్రచారాన్ని మరింత రంజుగా మార్చేసింది. ఈ సినిమా బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఏకంగా.. రాత్రికి రాత్రే కొత్త జీవో తెచ్చినట్టు సమాచారం. దీని ప్రకారం.. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోవడమే కాకుండా.. టిక్కెట్ల ధరలను కూడా పెంచొద్దని ఆదేశాలు జారీచేసిందని తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయంపై పవన్ అభిమానులతోపాటు జనసేన-బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆందోళన కూడా చేపట్టారు. ఈ ఆందోళనలో బీజేపీ నేత సునీల్ థియోదర్, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ థియోదర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పవన్ కల్యాణ్ ప్రభంజనానికి భయపడి సీఎం జగన్ బెనిఫిట్ షోలను రద్దు చేయించారని ఆరోపించారు. పవన్ సినిమా విడుదలవుతుంటేనే జగన్ ఇంతలా భయపడితే.. ఇక రాష్ట్ర పాలన ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని అన్నారు.
త్వరలో రాష్ట్రంలో మోడీ-పవన్.. జనసేన-బీజేపీ కాంబినేషన్ రాబోతోందని సునీల్ అన్నారు. బెనిఫిట్ షోను ప్రదర్శించడానికే భయపడే జగన్.. ఈ కాంబినేషన్ ను తట్టుకొని నిలబడగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ సాగిస్తున్న అరాచక పాలనకు మోడీ-పవన్ కాంబినేషన్ తెర దించుతుందని అన్నారు.
ఈ సందర్భంగా థియేటర్ వద్ద జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ప్రతీశుక్రవారం కోర్టుకు.. వకీల్ సాబ్ ను చూస్తే జగన్ కు వణుకు’ అంటూ నినాదాలు చేశారు.