AP Assembly Sessions: తొలిరోజు రచ్చ…14 మంది టిడిపి ఎమ్మెల్యేలపై వేటు

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని.. కనీస ఆధారాలు లేకుండా.. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడం దారుణమని టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

Written By: Dharma, Updated On : September 21, 2023 2:12 pm

AP Assembly Sessions

Follow us on

AP Assembly Sessions: అనుకున్నట్టే జరిగింది. ఏపీ శాసనసభ సమావేశాలు రచ్చ రచ్చగా సాగాయి. తొలి రోజే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ అంశంతో శాసనసభ అట్టుడికింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన గురువారం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 14 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం సమావేశాలకు హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు పట్టుపట్టారు. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన గళం ఇప్పించారు. దీంతో స్పీకర్ 14 మంది టిడిపి ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఒకరిని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని.. కనీస ఆధారాలు లేకుండా.. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడం దారుణమని టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ ఘటనపై చర్చకు అనుమతి కావాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు. కానీ ఆయన అనుమతి ఇవ్వలేదు. దీంతో టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఈ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి అంబటి రాంబాబు వైపు చూస్తూ మీసం మెలేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇది సినిమాలు కాదు.. శాసనసభ అన్న విషయం బాలకృష్ణ తెలుసుకోవాలి.. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్ చేశారు.దీంతో కొద్దిసేపు సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే టిడిపి సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చించాల్సిందేనని తేల్చి చెప్పారు. వీరికి వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి మద్దతు తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని స్పందించారు. 14 మంది టిడిపి ఎమ్మెల్యేలతో పాటు వైసిపి బహిష్కృత ఎమ్మెల్యేను ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా అనుకూలంగా ఓటు వేశారన్న అనుమానంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

కాగా సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో కింజరాపు అచ్చెనాయుడు,నందమూరి బాలకృష్ణ, బెందాలం అశోక్, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు,డోల బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.