AP Assembly: ఏకైక రాజధాని అమరావతికి మద్దతుగా రైతులు ఒక వైపు మహా పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు మూడు రాజధానులే ప్రధాన అంశంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏళ్లు గడుస్తున్నా దీనికి కార్యరూపం తేలేకపోయింది. అటు ఏకాభిప్రాయానికి ప్రయత్నించక… ఇటు సాంకేతిక సమస్యలు అధిగమించలేక మూడు రాజధానుల అంశం ఇంకా పురిటినొప్పుల్లోనే ఉంది.

ఎన్నికలు సమీపిస్తుండడంతో..
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా 17 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అన్నివిధాలా నిర్వీర్యం చేసిందని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి సమయంలో వెనక్కి తగ్గితే రాజకీయంగా అప్రతిష్టపాలవుతామని గుర్తించిన జగన్ సర్కారు.. వీలైనంత త్వరగా మూడు రాజధానుల ఏర్పాటును పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ను విశాఖకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ శాసనసభ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నా.. విపక్షాలే అడ్డుకుంటున్నాయన్న ప్రచారానికి తెరలేపాలని చూస్తున్నట్టు సమాచారం.
కోర్టు తీర్పు ఇచ్చినా…
తొలిరోజు గురువారం మూడు రాజధానులపై సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. అమెరికా తరహాలో ఏపీ అభివృద్ధి చెందుతుందని.. అది మూడు రాజధానులతో సాధ్యమవుతుందని వివరించే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆరు నెలల వ్యవధిలో అమరావతిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే సమయం చాలదని ఒకసారి, నిధుల కొరత ఉందని మరోసారి.. ఇలా పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తూ ప్రభుత్వం కాలం గడుపుతూ వచ్చింది. అటు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టను ఆశ్రయించలేదు. వ్యూహాత్మకంగా తాత్సారం చేస్తూ వచ్చింది. అయితే అమరావతి లో అభివృద్ధికి కోర్టు ఇచ్చిన గడువు దాటిపోయింది. కానీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం ఒక్క పని పూర్తిచేసిన దాఖలాలు లేవు. పైగా అమరావతి భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

నేడు కీలక ప్రకటన..
ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు నిర్మించి తీరుతామని మంత్రులు ఒక వైపు ప్రకటనలు చేస్తున్నారు. కానీ న్యాయస్థానం ఎదుట మాత్రం ఈ విషయం చెప్పలేకపోతున్నారు. అమరావతి ఏకైక రాజధాని తమకు ఇష్టం లేదని.. మూడు రాజధానులే తమ అభిమతమని ప్రభుత్వం సైతం న్యాయస్థానం వద్ద స్ఫష్టత ఇవ్వలేకపోతోంది. అటు మహాపాదయాత్రను పోలీస్ శాఖతో అడ్డుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. న్యాయస్థానం ఆదేశాలతో పాదయాత్ర ఉద్యమంలా సాగుతోంది. ఇప్పటికే మూడు రాజధానులకు సంబంధించి బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. న్యాయ నిపుణుల సలహాతో మరో బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండడంతో మూడు రాజధానులకు మద్దతుగా మరోసారిబిల్లు ప్రవేశపెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ వద్ద ఎన్నడూ లేనంతంగా భారీ పోలీస్ బందో బస్తు ఏర్పాటుచేయడంతో అనుమానాలకు బలం చేకూరుస్తోంది,. ప్రభుత్వం నుంచి కీలక రాజకీయ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.