
జీవో నెంబర్ 203 కి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతుంది. పోతిరెడ్డి పాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసిన వాదన ఆసక్తికరంగా ఉంది. తెలంగాణలో పలు కొత్త ప్రాజెక్టులు కేంద్ర జలసంఘం పరిశీలనగాని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కాని లేకుండానే చేపట్టారని ఏపీ కృష్ణా బోర్డుకు లేఖ ద్వారా తెలియచేసింది.
“వీటివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపైన, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటిపైన ప్రభావం పడుతుందని పేర్కొంది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 చేసే కేటాయింపుల మేరకే తాము వినియోగించుకుంటామని చెప్పారని, ఈ మేరకే పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై ముందుకెళ్తున్నామన్నారని ఏపీ గుర్తుచేసింది. ఇప్పుడు తాము కూడా అదే పద్ధతిలో కరవుతో అల్లాడే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగు అవసరాల కోసం శ్రీశైలంలో 800 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపింది. తమకు కేటాయించిన మేరకే నీటిని వినియోగించుకుంటామని” ఏపీ ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది.