
AP Electricity Bills: కర్నాటక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 16న నోటిఫికేషన్ రానుంది. మే 10న పోలింగ్.. అక్కడకు మూడు రోజుల తరువాత కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈసారి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అటు పట్టుబిగించేందుకు బీజేపీ సైతం ప్రయత్నిస్తోంది. అయితే కర్నాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగు పార్టీలు ఇంతో కొంత ప్రభావం చూపిస్తాయి. తెలుగు ప్రజలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అందుకే అక్కడ పార్టీలు ఏపీ నాయకులపై ఎక్కువగా ఆధారపడుతుంటాయి. అయితే ఈసారి కర్నాటక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేనలు ఎటువంటి స్ట్రాటజీ తీసుకుంటాయో అన్నది హాట్ టాపిక్ గా మారింది.
గత ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ..
2018 కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసింది. వైసీపీ మాత్రం లోపయికారీగా మద్దతు పలికింది. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావడమే అందుకు కారణం. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సాయాన్ని వైసీపీ కోరుకుంది. దీంతో కర్నాటక ఎన్నికలు వచ్చాయి. టీడీపీ వ్యతిరేకించగా.. వైసీపీ మాత్రం సాయం అందించింది. అయితే ఈ దఫా కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పట్లో ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ… బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మొత్తంలో ఆర్థిక వనరులను కూడా టీడీపీ సమకూర్చిందనే ఆరోపణలున్నాయి. వైసీపీ మాత్రం బళ్లారి వంటి సరిహద్దు ప్రాంతాల్లో విశేష ప్రభావం చూపించగలిగింది. బీజేపీ అభ్యర్థులకు అన్నివిధాలా చేయూతనందించింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. కానీ 37 స్థానాలు సాధించిన జేడీఎస్, 80 స్థానాలను గెలిచిన కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
బీజేపీకి సాయం చేసేదెవరు?
జేడీఎస్, కాంగ్రెస్ కూటమిని పక్కకు నెట్టి బీజేపీ పవర్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది. దీంతో ఏపీలోని రాజకీయ పార్టీల అవసరం అనివార్యంగా మారింది. అయితే ప్రస్తుతం ఏపీలో జనసేన అధికారికంగా మిత్రపక్షంగా ఉంది. అటు అధికార పక్షం వైసీపీ, విపక్షం టీడీపీ బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాయి. దీంతో మూడు పక్షాలు అనుకూలంగా ఉండడంతో బీజేపీ ఎవరి సాయం తీసుకుంటుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సైతం బరిలో దిగే చాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే జేడీఎస్ తో జతకట్టి తెలుగు ప్రజలపై ప్రభావం చూపడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారు. ఇటువంటి సమయంలో బీజేపీ జగన్ సాయం తీసుకుంటుందా? లేక చంద్రబాబుదా అంటూ చర్చ మొదలైంది.

హైకమాండ్ పెద్దలు కోరితే..
కర్నాటక ఎన్నికల్లో సాయం చేయాలనుకుంటే టీడీపీ బాహటంగా ముందుకొచ్చే అవకాశముంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ స్ట్రాటజీ మార్చుకుంది. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గుర్తించింది. అందుకే బీజేపీ విషయంలో అచీతూచీ అడుగు వేయడానికి సిద్ధపడుతోంది. వీలైనంతవరకూ కర్నాటక ఎన్నికల్లో సైలెంట్ గా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీ సాయం కోరితే మాత్రం ఏపీలో పొత్తుల అంశాన్ని తెరపైకి తేవాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో రావడం వల్లే ఓటమి ఎదురైందని జగన్ భావిస్తున్నారు. అందుకే కర్నాటక ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉండడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ సైతం ఏపీ ఎన్నికల్లోనే మిత్రపక్షంగా ఉన్నా సైలెంట్ అయ్యారు. ఇక కర్నాటక ఎన్నికల్లో తలదూర్చే చాన్సే లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.