Chandrababu: చంద్రబాబుకు కోర్టుల్లో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఎక్కడా ఊరట దక్కడం లేదు. తాజాగా హైకోర్టులో సైతం ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ స్కాం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీంతో చంద్రబాబుకు నిరాశ తప్పలేదు. సుప్రీం కోర్టులో చుక్కెదురైతే చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏసీబీ కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు హైకోర్టు నిరాకరించింది.సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న దృష్ట్యాహైకోర్టు విచారణకు నిరాకరించినట్లు సమాచారం.
మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. తొలుత ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇరువర్గాల వాదన విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 9 కి వాయిదా వేసింది. ఈ తరుణంలో నిన్న సుదీర్ఘమైన వాదనలు కొనసాగాయి. ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. దీనిపై సాయంత్రానికి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఇంతలో ముందస్తుగా హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణకు నిరాకరించింది. దీంతో అందరి చూపు సుప్రీంకోర్టు వైపే ఉంది.