Delhi Blast Investigation: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసు క్రమంగా జాతీయ భద్రతా చర్చగా మారుతోంది. ప్రాథమిక విచారణలోనే ఇది ఒక చిన్న స్థాయి పేలుడు కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించారు. డ్రోన్లను ఆయుధ ఉపకరణాలుగా మార్చడం, చిన్న రాకెట్లు తయారు చేయడం వంటి అంశాలు దర్యాప్తులో బయటపడటంతో దేశవ్యాప్తంగా అప్రమత్తత పెరిగింది.
హమాస్ తరహా ప్రణాళిక..
2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన ఆపరేషన్‌ను ప్రేరణగా తీసుకుని, ఇలాంటి ‘కోఆర్డినేటెడ్ మల్టీ–అటాక్’ చేయాలని ప్రణాళిక రచించారని ఎన్‌ఐఏ విచారణలో తెలిసింది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ నుంచి లభించిన వివరాలు ఈ కుట్ర ఆవిర్భావానికి ఆధారమయ్యాయి. సోషియల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ చాట్‌ల ద్వారా విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు చెబుతున్నాయి.
డ్రోన్లను ఆయుధాలుగా మార్చి..
భారతీయ భద్రతాధికారులను ఎక్కువగా కలవరపెడుతున్న అంశం ఉగ్రవాదులు డ్రోన్లను పేలుడు పదార్థాలను మోసేందుకు, లేదా వాటిని క్షిపణిలా వినియోగించేందుకు ప్రత్యేకంగా ట్రయల్స్ నిర్వహించినట్లుగా గుర్తించారు. ఇది కొత్త తరం ‘‘డ్రోన్ టెర్రరిజం’’ రూపమని అధికారులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక్క కారు పేలుడు కాదు, పెద్దస్థాయిలో నగర కేంద్రాలపై దాడులు చేపట్టే ప్రయత్నానికి పరీక్ష మాత్రమేనని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు.
డానిష్‌కు విస్తృత నెట్‌వర్క్..
డానిష్, అతని సహచరులకి మధ్యప్రాచ్య దేశాల్లోని తీవ్రవాద మాడ్యూల్స్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నెట్‌వర్క్ భారత యువతను ఆన్‌లైన్ ప్రోపగాండా ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నించిందని వివరాలు సూచిస్తున్నాయి. ఫండింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ చానెల్స్ ట్రాక్ చేయడానికి ఎన్‌ఐఏ డిజిటల్ ఫోరెన్సిక్ బృందాలను ఉపయోగిస్తోంది. రిమోట్ టెక్నాలజీ, డ్రోన్ కంట్రోల్ వ్యవస్థల మార్గంలో సాగుతుండటం భద్రతా విభాగాలకు కొత్త పరీక్షగా మారింది.
ఢిల్లీ పేలుడు కేసు ఒక హెచ్చరికగా నిలిచింది. టెర్రర్ శిక్షణ కేంద్రాల నుంచి సైబర్ కమ్యూనికేషన్ దిశగా ఉగ్ర కార్యకలాపాలు మారుతున్నాయి. డ్రోన్ల నుంచి సోషల్ మీడియా వరకు వ్యాప్తిచెందిన ఉగ్ర సాంకేతిక వ్యూహాలను ఎదుర్కోవాలంటే జాతీయ భద్రతా వ్యవస్థ మరింత ఆధునీకరించాల్సి ఉంది.