Telangana Election Survey: తెలంగాణ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి ఓటేస్తారు అనే విషయమై శ్రీఆత్మసాక్షి సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. అక్టోబర్‌ 28 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది.

Written By: Raj Shekar, Updated On : October 30, 2023 3:14 pm
Follow us on

Telangana Election Survey: తెలంగాణ అసెంబ్లీ ఎనినకల కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్‌ 30న ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ్రçపజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే ప్రజల నాడి పట్టుకొనేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా –నేనా అనే స్థాయిలో పోటీ ఉందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరి తాజా సర్వే ఎవరు చేశారు, ఎవరు గెలుస్తారని చెప్పారో చూద్దాం.

హోరా హోరీ పోరు..
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి ఓటేస్తారు అనే విషయమై శ్రీఆత్మసాక్షి సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. అక్టోబర్‌ 28 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక తరువాత కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. ఈ దశలో బీజేపీ వర్సస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా సాగిన తెలంగాణ రాజకీయం కమలం పార్టీ అంతర్గత వ్యవహారాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినట్లు ఆత్మసాక్షి వివరించింది.

బీఆర్‌ఎస్‌కే ఎడ్జ్‌…
ఈనెల 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ పబ్లిక్‌ మూడ్‌ ఏంటనేది వెల్లడించే ప్రయత్నం చేసింది. అందులో 42.5 శాతం ఓట్‌ షేర్‌తో బీఆర్‌ఎస్‌ 64–70 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేసింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్‌ 36.5 ఓట్‌ షేర్‌తో దాదాపుగా 37–43 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బీజేపీ 10.75 శాతం ఓట్‌షేర్‌ తో 5–6 సీట్లు, ఎంఐఎం 2.75 శాతం ఓట్‌ షేర్‌ తో 6–7 సీట్లు దక్కించుకొనే ఛాన్స్‌ ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఇక్కడ ఆరు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుందని సర్వే అంచనా వేసింది. అందులో బీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 2, బీజేపీ ఒక్క స్థానంలో ఆధిక్యత కనిపిస్తోందని వెల్లడించింది.

మారుతున్న సమీకరణాలు..
పోలింగ్‌కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం పైన అవగాహన.. స్థానిక పరిస్థితులు..సమీకరణాల పైన పూర్తి లెక్కలతో కేసీఆర్‌ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రభావితం చేసే అంశాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ స్కీంలు అమలు చేస్తామని స్పష్టంగా చెబుతోంది. అవే తమకు అధికారం తెచ్చి పెడతాయనే ధీమాలో పార్టీ నేతలు ఉన్నారు. పార్టీలో మేనిఫెస్టో మొదలు అభ్యర్దుల ఎంపిక వరకు హైకమాండ్‌ స్వయంగా పర్యవేక్షిస్తోంది.

ఇక బీజేపీ బీసీ అంశంతో ముందుకు వెళ్తోంది. అయితే ప్రచారంలో మాత్రం బీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రచార సరళి, కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టో ఆధారంగా ఫలితాలు తారుమారు కావొచ్చని సర్వే సంస్థతోపాటు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి శ్రీఆత్మసాక్షి సంస్థ సర్వే ఏమేరకు నిజమవుతుందో చూడాలి.