
ప్రపంచానికి మరో రకం కరోనా భయపెట్టేలా దూసుకొస్తోంది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ ‘లాంబ్డా’ అనే రకం ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండాన్ని కబళిస్తోంది. ఇది అనేక దేశాలకు విస్తరిస్తూ ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ కూడా దీన్ని ప్రమాదకర వైరస్ రకంగా ప్రకటించడం తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇక బ్రిటన్ లోనూ ఈ కేసులు వెలుగుచూశాయి. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) కూడా దీన్ని పరిశోధిస్తోంది. బ్రిటన్ లో ఇప్పటికే ఈ ఆరు లాంబ్డా రకం కేసులు వెలుగుచూశాయి.
మొట్టమొదట ‘లాంబ్డా’ రకం కరోనా కేసు గత ఏడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఈకేసులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఏప్రిల్ నుంచి పెరూలో బయటపడిన కోవిడ్ కేసుల్లో ఈ వేరియంట్ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం.
గత 60 రోజుల్లోనే ఇది చిలీలో 32శాతానికి పెరిగింది. తీవ్రంగా ప్రబలుతోంది. ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి గానీ.. ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనిపై స్పైక్ ప్రోటీన్ లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది ఉధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డెల్టా వైరస్ ను మించి ప్రబలుతున్న ఈ వైరస్ పై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.