T BJP: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోంది. కేంద్రంలో బీజేపీ బలంగా ఉండటంతో స్థానిక నేతలు దీనిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తుండటంతో ఆపార్టీ ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిస్తోంది.
టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంతో ఆపార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరిగింది. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను క్రమంగా ఆపార్టీ నుంచి బయటికి పంపించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యతిరేకులకు టీఆర్ఎస్ అధిక ప్రాధాన్యం లభిస్తుండటంపై పలువర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
మరోవైపు సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పింది ఒకటి చేసేది మరొకటి అని మేధావి వర్గాల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు అంతా మండిపడుతున్నారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్ దూరమైన ఉద్యమకారులంతా ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరి హుజూరాబాద్లో విజయం సాధించి ఆపార్టీకి గట్టి షాకిచ్చారు.
ఈటల విజయంతో నాటి ఉద్యమకారులంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ ఉద్యమ సమయంలో తనతో కలిసి పని చేసిన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా నాడు ఉద్యమంలో ఉద్యోగుల సంఘం తరపున పని చేసిన కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు.
నాడు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విఠల్ ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈటల తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక ఉద్యమ సమయంలో కీలక వ్యవహరించిన నాటి టీఎన్టీవో అధ్యక్షుడు స్వామిగౌడ్ తొలుత టీఆర్ఎస్ లో చేరి మండలి ఛైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పటికే బీజేపీలో చేరారు.
Also Read: కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. అసలు కారణం ఇదేనా?
అదేవిధంగా మరో టీజీవో నేత స్వామిగౌడ్ ఎమ్మెల్యే గెలిచి కేసీఆర్ క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఇక విఠల్ ను మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమించింది. ఇటీవల ఆయన పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాతి ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆయన సీఎం కేసీఆర్ కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారనే టాక్ విన్పిస్తోంది.
ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పక్కన పెట్టిన ఉద్యమకారులందనీ బీజేపీ ఏకం చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. వీరందరినీ బీజేపీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో విభిన్నమైన వ్యూహాలతో ముందుకెళుతున్న బీజేపీ మున్ముందు ఎలాంటి రాజకీయాలు చేస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.
Also Read: వారిద్దరు ‘చేయి’ కలిపినట్లేనా?