Konaseema Politics: వైసీపీని కలవర పెడుతున్న గోదావరి జిల్లాలు..తాజాగా అమలాపురంలో

సీఎం జగన్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించాల్సి ఉంది. డ్వాక్రా సంఘాల 0 వడ్డీ రాయితీ నిధులను సీఎం జగన్ అమలాపురం నుంచి ప్రారంభించాలనుకున్నారు. భారీ వర్షాలతో ఈ కార్యక్రమం రద్దయింది.

Written By: Dharma, Updated On : July 26, 2023 12:38 pm

Konaseema Politics

Follow us on

Konaseema Politics: గోదావరి జిల్లాల్లో వైసీపీలో నెలకొన్న విభేదాలు హై కమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరేగా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్సెస్ ఎంపి చంద్రబోస్ వర్గాలు బాహటంగానే వీధి పోరాటానికి దిగుతున్నాయి. ఇది మరువక ముందే అమలాపురం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి.

సీఎం జగన్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించాల్సి ఉంది. డ్వాక్రా సంఘాల 0 వడ్డీ రాయితీ నిధులను సీఎం జగన్ అమలాపురం నుంచి ప్రారంభించాలనుకున్నారు. భారీ వర్షాలతో ఈ కార్యక్రమం రద్దయింది. ఏర్పాట్లు పూర్తయినా వర్షాలు దృష్ట్యా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అధికార పార్టీలో విభేదాలు కారణమయ్యాయి. మంత్రి విశ్వరూప్ ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా స్థానిక ఎంపీ అనురాధ ఫోటో లేదు. ఇది పెను వివాదానికి దారి తీసింది. ఎంపి అనుచరులు మంత్రి విశ్వరూప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి విశ్వరూప్ పక్క ప్లాన్ తోనే స్థానిక ఎంపీని అవమానపరిచారని ఆమె అనుచరులు తెగ బాధపడుతున్నారు. పక్క జిల్లా నేతల ఫోటోలు ఉంచి స్థానిక ఎంపీని విస్మరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ స్థానానికి మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను బరిలోదించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వ్యూహాత్మకంగా స్థానిక ఎంపీ అనురాధను పక్కకు తప్పిస్తున్నట్లు ఆమె అనుచరులు అనుమానిస్తున్నారు. హై కమాండ్ వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.

అయితే గోదావరి జిల్లాలో వరుసగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ హై కమాండ్ కు మింగుడు పడడం లేదు. కొందరు సీనియర్లే పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రపురం ఎపిసోడ్ ను తాత్కాలికంగా సుఖాంతం చేసినా మున్ముందు తలనొప్పులు ఉంటాయని హై కమాండ్ భావిస్తుంది. అవసరమైతే అందులో ఒక నాయకుడిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అందుకే ఎంపీ బోస్ వెనక్కి తగ్గారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అమలాపురం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.