TRS Committee: సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని ఆపార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ది పథకాలపై దృష్టి సారిస్తూనే పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇటీవలే ఎవరూ ఊహించని విధంగా 33 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. జనవరి 26న విడుదలైన ఈ జిల్లాల కమిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత కల్పించారు. ఈ కమిటీలపై టీఆర్ఎస్ లో పెద్దగా వ్యతిరేకత వచ్చిన దాఖలాల్లేవు. దీంతో మరో కమిటీని వేసేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా సాగే అవకాశం ఉంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ త్వరలోనే రాష్ట్ర కమిటీని సైతం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ కమిటీలో ఎవరెవరినీ తీసుకుంటారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. రాష్ట్ర కమిటీలో ఎంపిక చేసే నేతల విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం భారీగా కసరత్తులు చేస్తుందనే టాక్ విన్పిస్తోంది.
ఈ కమిటీలో విపక్షాలపై దూకుడుగా వ్యవహరించే నేతలకే అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, కేటీఆర్ భావిస్తున్నారట. అలాంటి వారిని ఎంపిక చేసే పనిలోనే టీఆర్ఎస్ అధిష్టానం ఉందని సమాచారం. మరోవైపు ఇప్పటికే పలువురు కీలక నేతలకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడంతో ఆ నేతలకు రాష్ట్ర కమిటీలో స్థానం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
రాబోయే ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కమిటీని భారీగా నియమించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా కూడా తమకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో తమకు చోటు దక్కుతుందా .. లేదా అని ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ కొత్త కమిటీ కూర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.
[…] Also Read: టీఆర్ఎస్ లో మరో కమిటీ.. ఆసక్తి చూపుతున… […]