తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మొన్నటికి మొన్న భారీ పేలుడు, అగ్ని ప్రమాదం సంభవించి 9మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసింది.దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో శ్రీశైలం పేలుళ్లను సిఐడికి అప్పగిస్తూ సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ఆ ప్రమాదాన్ని మరిచిపోకముందే తాజాగా బుధవారం సాయంత్రం మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్ల పైనుంచి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి దాదాపు 10 మీటర్ల చొప్పున మంటలు ఎగిసిపడ్డాయని తెలిసింది.
ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో అక్కడి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈక్రమంలోనే మరోసారి అగ్ని ప్రమాదం ఘటనపై జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు.
ఇది ప్రమాదం కాదని.. పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు స్పష్టం చేశారు. అయితే సిబ్బంది కూడా తెలియకుండా మాక్ డ్రిల్ నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే రహస్యంగా మాక్ డ్రిల్ చేశామని.. సిబ్బందిని అప్రమత్తతను పరీక్షించామని సీఎండీ ప్రభాకర్ రావు తెలుపడం నమ్మశక్యంగా లేదని పలువురు అనుమానం పడుతున్నారు. ప్రమాదం జరిగినా దాస్తున్నారా అని అనుమానపడుతున్నారు.