
శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బడ్జెట్ పై చర్చ జరుగుతున్న క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర రావు మాట్లాడుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని అక్రమంగా అరెస్టు అంశాన్ని లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని అన్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ.. ఆయన దొంగ కాబట్టే అరెస్టు చేశారని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ జోక్యం చేసుకుని టీడీపీ హయాంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు.
ఈ సమయంలో సభ్యులు ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తనను ఓడించడాని కోట్లు ఖర్చు చేశారని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహంతో సభలో తొడగొట్టి మరీ టిడిపి సభ్యులను బెదిరించే యత్నం చేశారు. ఓ సందర్భంలో ఇరువురు సభ్యులు ఒకరి వైపుకు మరొకరు దూసుకు రావడంతో తోటి సభ్యులు నిలువరించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రుల వేష, భాషలపై అంతటా చర్చ జరుగుతుందని అన్నారు. గడ్డం పెంచుకున్న వాళ్ళంతా రౌడీలా… చంద్రబాబు గడ్డం పెంచుకున్నారు. ఛైర్మన్ కు గడ్డం ఉంది…వారు రౌడిలా అంటూ దీపక్ రెడ్డిని మంత్రి అనిల్ ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన మండలి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
వాయిదా అనంతరం సమావేశమైన మండలిలో తమ సభ్యులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి రికార్డుల నుంచి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఛైర్మన్ ను కోరారు. అధికార పక్షం సభ్యులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ ను కోరారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ షరీఫ్ మహ్మద్ తెలిపారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టక ముందే మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.