దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత ఎంతో పాపులర్. కరోనా-లాక్ డౌన్ తో అన్నింటికి మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వాలను సినిమా ఇండస్ట్రీకి మాత్రం మొదట ఇవ్వలేదు. అయితే బతిమాలి.. బమాలి మరీ సినిమా షూటింగ్ లకు అనుమతులు తెచ్చుకున్నా టాలీవుడ్ సినీ ప్రముఖులు. సీఎంలు కేసీఆర్, జగన్ లతో భేటి అయ్యి మరీ సాధించుకున్న అనుమతులు ఇప్పుడు వృథా అయ్యాయి. సినిమా షూటింగ్ లు మొదలైతే.. తమ కడుపులు నిండుతాయని భావించిన సినీ కార్మికులకు నిరాశే ఎదురైంది.
రాజమౌళి, కొరటాల శివ సహా ప్రముఖ దర్శకులతో సగంలో ఆగిపోయిన తమ సినిమాలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇస్తే చేద్దామని ప్లాన్ చేశారు. ఈ మేరకు తిరిగి ప్రారంభించడానికి తమ ప్రణాళికలు కూడా రూపొందించారు. అంతా సిద్ధమనుకుంటున్న తరుణంలో హీరోలు, సినీ ప్రముఖ నటులు హ్యాండిచ్చారట..
ప్రస్తుతం సీఎంలను అడిగినప్పటి కంటే ముందే దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే అంతుచిక్కడం లేదు. దీంతో ఇలాంటి విపత్కర పరిస్థితిలో పనిచేయడానికి హీరోలు, సినీ నటులు ఆసక్తి చూపించడం లేదు. ఇక షూటింగ్ లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి నటులు హైదరాబాద్ రావడానికి నిరాకరిస్తున్నారు.
ప్రస్తుత కరోనా వేళ షూటింగ్ లకు వచ్చే నటీనటులు హోటళ్లలో బసచేయడం.. విమానాలు, కార్లలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. అందుకే షూటింగ్ లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నటులు ఎవరూ రావడానికి ధైర్యం చేయడం లేదట.. వైరస్ తగ్గే వరకు షూటింగ్ లో పాల్గొనమని స్పష్టం చేశారట..
ఇక మన అగ్రహీరోల్లో అంతా 60 ఏళ్లు పైబడిన వారే. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా 60ఏళ్లకు అటూ ఇటూగా ఉన్న వారు కూడా షూటింగ్ లో పాల్గొనే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇతర రాష్ట్రాల నటీనటులు కూడా ఈ సమయంలో తాము రిస్క్ చేయలేమని దర్శకులు, నిర్మాతలకు స్పష్టం చేస్తున్నారట..
ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి అనుమతులు రాగానే మాక్ షూట్ ప్లాన్ చేసిన రాజమౌళి కూడా తన ప్రణాళికలను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ మినహా తెలుగు చలనచిత్ర , టీవీ పరిశ్రమ ఇప్పటికీ లాక్ డౌన్ లోనే ఉంది.
జూలై 31 వరకు పరిస్థితి మెరుగుపడితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి తిరిగి సినిమా షూటింగ్ లలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి కేసీఆర్, జగన్ అనుమతులు ఇచ్చినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా లాక్ డౌన్ లోనే ఉండడం గమనార్హం.
-నరేశ్ ఎన్నం