Nellore Politics: నెల్లూరు వైసీపీలో రచ్చ ఆగడం లేదు. సీఎం జగన్ జోక్యం చేసుకున్నా కొలిక్కిరావడం లేదు. పోటా పోటీ సమావేశాలు, బల ప్రదర్శనలు, ఒకరి నియోజకవర్గాల్లో ఒకరి పర్యటనలతో తాజా, మాజీ మంత్రులు కాకాని గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కాక రేపిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణతో విభేదాల పర్వం తారాస్థాయికి చేరింది. అధిష్టానం వెనక్కి తగ్గాలని ఆదేశాలిచ్చినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రత్యేకంగా ద్రుష్టిసారించాల్సి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు తాజా మాజీలిద్దరూ వేర్వేరుగా సీఎం జగన్ ను కలిశారు. సంజాయిషి ఇచ్చుకున్నారు.
చాలాసేపు సీఎంతో చర్చించారు. దాదాపు అంతా కొలిక్కి వచ్చిందంటున్న తరుణంలో విలేఖర్ల సమావేశంలో విడివిడిగా మాట్లాడిన నేతలిద్దరూ మళ్లీ పాత పద్ధతిలోనే తమ వ్యాఖ్యానాలు సాగించారు. దీంతో ఈ తతంగం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనను తొలగించి కాకాణిని కేబినెట్‌లోకి తీసుకోవడంపై అనిల్ మనస్తాపానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారానికి తనను కాకాణి పిలవకపోవడంతో గైర్హాజయ్యారని ప్రచారం జరిగింది. కాకాని జిల్లాకు తొలిసారి విచ్చేయనున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ స్వాగత కార్య్రక్రమాలను ఏర్పాటుచేశాయి. దీనికి దీటుగా అదే రోజు అనిల్ పోటీ సభ నిర్వహించారు. కాకాణి, వేమిరెడ్డి ఫ్లెక్సీలను అనిల్ వర్గీయులు చించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విభేదాలు ముదురుపాకాన పడడంతో సీఎం కలుగజేసుకున్నారు. క్యాంపు కార్యాలయంలో వారితో విడివిడిగా మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కాకాణి, అనిల్ తమ వాదనలు వినిపించారు. తాను మంత్రిగా ఉన్న మూడేళ్లూ నెల్లూరు జిల్లాలో నాయకుల నుంచి ఎదురైన సహాయ నిరాకరణ గురించి అనిల్ వివరించారు. మంత్రి పదవి కోల్పోయాక తనకు సహకారం అందించినవారిని అభినందించేందుకే బహిరంగ సభను నిర్వహించానని చెప్పారు. తనకంతా తెలుసునని.. నేను చూసుకుంటానని సీఎం జగన్ భుజం తట్టి పంపిం చేశారు.
అదే దూకుడులో అనిల్
అయితే అనిల్ సీఎంతో బేటీ అనంతరం విలేఖర్ల సమావేశంలో అదే దూకుడుతోనే మాట్టాడారు. జగన్ తనకు కొండంత అండ అన్నారు. అందుకే తాను ఒంటరిని కాదన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు అందర్నీ కాకిణి కలుస్తున్నారనే వార్తలకు ఆయన కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. అలాగే సీఎం అండ ఉన్నంత వరకు తాను ఎందుకు ఒంటరి అవుతాను అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు రెండు జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ణతలు తెలిపేందుకు మాత్రమే ఇక్కడి వచ్చాను అన్నారు. పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారని.. తామంతా సీఎం మనుషులుగానే పని చేస్తామన్నారు. సీఎం గీత గీస్తే ఎవరూ దాటే పరిస్థితి లేదన్నారు.తాను జగన్ మనిషినని, 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు పనిచేస్తానని, 175 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించినా సైనికుడిలా పనిచేస్తానని తెలిపారు. నెల్లూరులో కోల్డ్ వార్ అంటూ ఏమీ లేదన్నారు. తన నియోజక వర్గంలో ఫ్లెక్సీలు వేయడమనేది రెండున్నరేళ్లుగా ఎక్కడా లేదని.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీలు ఎవరు వేసినా తీసేశామని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో జగనే సీఎం అవుతారని.. తిరిగి 14 మంది మంత్రులవుతామని చెప్పకొచ్చారు. అప్పుడు చూపిస్తాను తన పవర్ అన్నట్టూ హెచ్చరికలు జారీచేసేలా మాట్లాడారు.
తగ్గినట్టే తగ్గి ‘కాక’ని
అటు కాకాని కూడా కాస్తా తగ్టినట్టు కనిపించినా.. తన మనసులో మాటను సీఎం జగన్ కు చెప్పినట్టు సమాచారం. మూడేళ్ల పదవీ కాలంలో అనిల్ తో ఎదురైన ఇబ్బందులను వివరించారు. జిల్లాలో ఏ నాయకుడితో పొసగదని చెప్పారు. పార్టీ లో విభేదాలకు అవకాశమిచ్చారని కూడా చెప్పారు. అయితే అంతా తనకు తెలుసునని.. సమన్వయం చేసి సమస్యలుంటే పరిష్కరిస్తానని.. అప్పటివరకూ అందరూ కలిసి పనిచేసుకోవాలని.. విభేదాల గురించి బయట మాట్లాడవద్దని జగన్ కాకానిని సర్థిచెప్పి పంపిం చేశారు. అయితే సీఎంతో భేటీ తరువాత కాకాణి మాట్లాడుతూ.. అనిల్ కు తనకు మధ్య ఎక్కడా విభేదాలు లేవన్నారు. పోటా సభలు ఎక్కడా పెట్టుకోలేదన్నారు. అదంతా మీడియా స్రుష్టిగా చెప్పుకొచ్చారు. కావాలనే ఈ విషయంపై ఫోకస్ పెట్టి మరింతా రాద్ధాంతం చేశారన్నారు. తమ ఫ్టెక్సీలను ఎవరూ చించలేదన్నారు. తామంతా ఒకే చెట్టు నీడలో సేదదీరే వారమని.. అసలు విభేదాలంటూ లేవనే బదులిచ్చారు. కానీ లోలోపల మాత్రం అనిల్ పై రగిలిపోతున్నట్టు కాకాని వర్గీయులు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అనిల్ అదే దూకుడుతో ఉండగా.. కాకాని మాత్రం తన మంత్రి పదవి ద్రుష్ట్యా కాస్తా తగ్గినట్టు కనిపించారు. మొత్తానికి ఈ వ్యవహారానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడే సూచనలేవీ కనిపించడం లేదు.
Also Read:Covid Fourth Wave: కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందా ? భయపెడుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్!
Recommended Videos